revanth reddy on rajagopal reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా ప్రకటనపై టీపీసీసీ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఓవైపు తల్లిలాంటి సోనియాగాంధీకి అవమానం జరుగుతుంటే రోడ్డు మీదికొచ్చి నిలదీయాల్సిందిపోయి.. వాళ్ల పంచన చేరేందుకు సిద్ధమవటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఈ నెల 5న మునుగోడులో నిర్వహించే సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరం దిల్లీలో రేవంత్ మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకు తామంతా అండగా ఉంటామని.. 5న మునుగోడు గడ్డపై కాంగ్రెస్ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, ఉప ఎన్నికలో వారిచ్చే తీర్పు దుష్టశక్తులకు చెంప పెట్టు కావాలన్నారు.
"కేసీఆర్, మోదీ కలిసి దుర్మార్గమైన క్రీడ ఆడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారు. రాజగోపాల్‌రెడ్డి ఇకపై కాంగ్రెస్ బిడ్డ కాదు. మోదీ, అమిత్ షా విసిరే ఎంగిలి మెతుకుల కోసం శత్రువు చెంత చేరి కన్నతల్లి వంటి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. సోనియాగాంధీని ఈడీ విచారణ చేస్తుంటే.. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. ఇలాంటి వారిని తెలంగాణ జాతి క్షమించదు. వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిపించుకుంది. ఒకసారి ఓడిపోతే ఎమ్మెల్సీని, ఆ తర్వాత ఎమ్మెల్యేను చేసింది. కాంగ్రెస్ వల్లే ఆ నేతకు బ్రాండ్ వచ్చింది. తెలంగాణ ఏర్పాటును మోదీ అవహేళన చేశారు. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన తెలంగాణను తప్పు పట్టారు. తెలంగాణను అవమానించిన వారిని ఎవరైనా పొగుడుతారా? మునుగోడు ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది." -రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
ఇవీ చూడండి..
'అవమానాలు భరిస్తూ ఉండలేను.. కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా..'
చైనా హెచ్చరించినా తైవాన్‌లో అడుగుపెట్టిన పెలోసీ.. క్షణక్షణం ఉత్కంఠ