revanth reddy house arrest : ప్రజా సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. పంచాయతీలకు నిధుల సమస్యపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నాకు పీసీసీ పిలుపునిచ్చింది. ఇందిరా పార్కు వద్ద ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా ఆందోళన చేస్తామని టీపీసీసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హస్తం పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో పోలీసులు నేతల ఇళ్ల వద్ద మోహరించారు. నాయకులెవరూ ఇంటి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. సర్పంచ్‌ల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనవలసిందిగా కోరారు. మరోవైపు కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్‌గౌడ్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకని.. అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడంలో అర్థం లేదని హస్తం నేతలు విమర్శించారు.
జిల్లాల నుంచి కూడా శ్రేణులు హైదరాబాద్ రానివ్వకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డిని గాంధీభవన్ వద్ద అరెస్టు చేసి బేగం బజార్ పోలీసు స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో ధర్నాలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దగ్దం లాంటి కార్యక్రమలు చేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని కోరారు.