గ్రేటర్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, అనుమతి లేని భవన నిర్మాణాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్, మెడికల్ అధికారులతో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, అదనపు కమిషనర్లు శృతి ఓజా తదితరులు సమావేశానికి హాజరయ్యారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అరవింద్ కుమార్ మండిపడ్డారు. బేగంపేట, ఖైరతాబాద్ పరిధిలోని ఆక్రమణలపై అధికంగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ ఇన్ఛార్జీగా ఉన్న బేగంపేట సహాయక సిటీ ప్లానర్ సుభాష్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో నిర్వహణ లోపం
ఆరు నెలల ఎన్నికల కోడ్ కారణంగా జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించారని పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ అన్నారు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు లేకపోవడం వల్లే పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ కుంటుపడిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు.
కోచింగ్ సెంటర్లపై దృష్టి
ఇటీవల సూరత్‌లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నగరంలోని అమీర్‌పేటలో కోచింగ్ సెంటర్ల నిర్వహణపై దృష్టి సారించాలని అరవింద్ కుమార్ ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, హోర్డింగ్‌లను వెంటనే తొలగించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల మెరుగు, ఆక్రమణల తొలగింపులో గణనీయ మార్పులు రావాలని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపు బాధ్యత టౌన్ ప్లానింగ్ అధికారులదేనని అన్నారు.
ఇదీ చూడండి : జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్