రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై భేటీలో చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.
వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ, పట్టణాభివృద్ధిపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సంయుక్త కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించడంతోపాటు స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియమించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. వీటిపై పలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఈ నెల 25లోగా జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. సమ్మేళనాల నిర్వహణ, సంబంధిత అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నీటిపారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. జూరాల పునరుజ్జీవనం కోసం అదనపు జలాశయ నిర్మాణం, ఇతర నీటిపారుదల అంశాలతో పాటు ఇతర పాలనాపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే వారి కోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆ విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇవీ చూడండి:ఇరాక్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ బాధితులు