నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లకు నిత్యం 9 వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాట వచ్చేది. అప్పుడు రూ.15లోపే రైతు బజారులో దొరుకుతుండేది. ప్రస్తుతం కేవలం 3 వేల టమాట బాక్సులు మాత్రమే వస్తున్నాయి. అంటే 75 వేల కేజీలు మాత్రమే చేరుతున్నాయి. ఇంత తక్కువ టమాటా రావడం ఇదే ప్రథమమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నుంచి 30 శాతం టమాట వస్తోంది. మిగతా 70 శాతం రాజస్థాన్‌లోని జోద్‌పూర్, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వస్తోంది. అక్కడ 25 కిలోల బాక్సు రూ.1,500 ఉండగా.. అంకాపూర్ నుంచి వచ్చే బాక్సు రూ.1,150 పలుకుతోంది. దీంతో రైతుబజారులోనే కిలో టమాటా రూ.50 అయ్యిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మదనపల్లి, అనంతపురం నుంచి విరివిగా టమాట నగరానికి వచ్చేది. ఇప్పుడది బెంగళూరు, తమిళనాడుతో పాటు శ్రీలంకకు ఎగుమతి అవుతోంది.
ఇవీ చూడండి: సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపునకు సర్వే.. సర్కారు ఆదేశం