TS CABINET MEET: రాష్ట్ర మంత్రివర్గం ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ వేదికగా జరగనున్న కేబినెట్ భేటీలో ఆర్థికపరమైన అంశాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షల నేపథ్యంలో అదనపు వనరుల దిశగా కార్యచరణపై మంత్రివర్గం దృష్టి సారించనుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే రుణాల్లో రూ.15వేల కోట్లు కోత విధించిన కేంద్రం.. వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పుల విషయంలో ఆంక్షలు విధించింది.
దీంతో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. భూముల అమ్మకం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల వేలం సహా పన్నేతర ఆదాయం పెంపు తదితర చర్యలను సర్కార్ ఇప్పటికే ప్రారంభించింది. వాటి ద్వారా ఖజానాకు కొంత మేర డబ్బు సమకూరింది. వీటి పరిస్థితిని సమీక్షిస్తూనే మిగతా వాటిపై కూడా కేబినెట్ చర్చించనుంది.
బడ్జెట్లో పొందుపర్చిన ఆదాయం కంటే దాదాపుగా రూ.30వేల కోట్లు అదనంగా సమీకరించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, రవాణా పన్నుల్లో బకాయిల వసూలు, వివాదాల పరిష్కారం సహా ఇతరత్రా సంస్కరణలపై చర్చించే అవకాశం ఉంది. గనుల రంగంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడం ద్వారా ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని రాబట్టుకోవాలని భావిస్తున్నారు.
కొత్త మైనింగ్ విధానంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు గృహనిర్మాణ సంస్థకు చెందిన ఖాళీ స్థలాల విక్రయం, ల్యాండ్ పూలింగ్ సహా ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ బాహ్యవలయ రహదారి చుట్టుపక్కల ఉన్న భూములను వాణిజ్య, నివాస సముదాయాలుగా బదలాయించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ల్యాండ్ పూలింగ్ విధానానికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. వీటన్నింటిపై మంత్రివర్గ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి ఓ కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది.
రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కేబినెట్లో చర్చించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆసరా ఫించన్లపైనా చర్చ జరగనుంది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య ఫించన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. డయాలసిస్ రోగులకు కూడా ఫించన్లు ఇస్తామని చెప్పారు. మరో పది లక్షల మంది వరకు కొత్త ఫించన్లు ఇస్తామని.. ఫించనుదారులందరికీ బార్ కోడ్‌తో కూడిన కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదల, శాసనసభ సహా స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలు, సంబంధిత అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు, భూకేటాయింపులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.
మంత్రివర్గ భేటీలో వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ధాన్యం అమ్మకాలు, వేలం, సంబంధిత అంశాలపైనా చర్చ జరగనుంది. ఇతర పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. దేశం, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీ వ్యూహం, కార్యాచరణ సంబంధిత అంశాలపై కూడా చర్చించనున్నారు.
జీవన్‌రెడ్డికి సీఎం భరోసా..
ఇటీవల హత్యాయత్నానికి గురైన పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, తెరాస నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి మనోధైర్యంతో, నిబ్బరంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఆయనకు తాము, తెరాస పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం పిలుపు మేరకు జీవన్‌రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌కు వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఆయన హత్యాయత్నం ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. తన హత్యాయత్నం వెనక పెద్ద కుట్ర ఉందని జీవన్‌రెడ్డి సీఎంకు చెప్పగా.. ఆయన స్పందించి, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి, ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు.
ఇవీ చదవండి: 'ఎవరిని నిలబెట్టినా గెలిపించేందుకు సై..' అసంతృప్తులతో మంత్రి చర్చలు సఫలం..
'నిరాశతో 'చేతబడి'ని ఆశ్రయిస్తోంది'.. కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు!