దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న సందర్భమిది. ఈ సమస్యనుంచి బయటపడేందుకు దేశవ్యాప్తంగా జరుగుతున్న కృషిలో సివిల్ సర్వెంట్లది సమధిక పాత్ర. రేయింబవళ్లు పనిచేసి స్వీయ నిర్బంధాన్ని కట్టుదిట్టంగా అమలుచేయడం మొదలు- వీధి వీధి తిరిగి కరోనా తీవ్రతపట్ల ప్రజలను అప్రమత్తం చేయడంవరకు పాలనాధికారులదే ప్రధాన బాధ్యత. సివిల్ సర్వెంట్ల నివేదికలే ప్రామాణికంగా ప్రభుత్వాలు విధానాలను రూపొందిస్తుంటాయి.
అంకితభావంతో కృషి..
దేశంలో వైరస్ ప్రభావం విస్తరిస్తున్న తొలినాళ్లలోనే ఒడిశా ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వి.కె.పాండియన్ అప్రమత్తమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఒడిశాకు వచ్చి కరోనా విస్తరణపై తక్షణం సర్వే జరిపి రూపొందించిన నివేదిక ఆధారంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం ‘లాక్‌డౌన్’ ప్రకటించింది. స్వీయ నిర్బంధం విధించిన మొదటి రాష్ట్రం ఒడిశా. ఆ స్థాయిలో జాగ్రత్తపడటంవల్లే ఒడిశాలో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. దీనంతటి వెనక ఓ సివిల్ సర్వెంట్ ముందుచూపు, అవగాహన ఉన్న విషయం సుస్పష్టం. వైరస్ విపత్తును సంఘటితంగా ఎదుర్కొనేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేస్తున్నారనడంలో మరో మాట లేదు. ఒడిశాలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శిగా పని చేస్తున్న నికుందా దళ్ అనే అధికారి తండ్రి మరణించిన కేవలం 24 గంటల్లోపే తిరిగి తన విధులకు హాజరు అయ్యారు. తాను దుఃఖసాగరంలో ఉన్నప్పటికీ మహమ్మారిని ఛేదించి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని భావించారాయన. విధి నిర్వహణ పట్ల ఆ అధికారి చూపిన నిబద్దత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా చంటిబిడ్డలను భుజాన మోస్తూ విధుల్లో పాల్గొంటున్న అధికారులకూ దేశంలో కొదవలేదు.
సేవలకు గుర్తింపు
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న అజోయ్ మెహతా పదవి కాలం గడచిన మార్చిలోనే ముగియాల్సి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అజోయ్‌కి ఉద్వాసన పలుకుతారనే అందరూ భావించారు. కానీ కరోనా విపత్తు ఉరుముతున్న తరుణంలో అజోయ్ అందిస్తున్న విలువైన సేవలను గుర్తించిన ఉద్దవ్ ఠాక్రే ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇది ఒకరకంగా ఆయన సేవలకు దక్కిన గుర్తింపుగానే భావించవచ్చు. నిబద్ధమైన కృషి చేసే అధికారులను మించిన స్నేహితులు సమాజానికి మరొకరు ఉండరు.
ఇదీ చూడండి : నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం