GHMC council meeting: గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఉదయం 10 గంటలకు గ్రేటర్ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం జరగనుంది. నూతన పాలక వర్గం పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా.. డివిజన్లకు సంబంధించిన సమస్యలపై చర్చలే జరగలేదని భాజపా కార్పొరేటర్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఛాంబర్లో ఇటీవల ఆందోళనకు దిగారు. తర్వాత అనేక రాజకీయ పరిణామాల అనంతరం అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల మధ్య ఇవాళ బల్దియా కౌన్సిల్ ఏర్పాటు చేశారు. కరోనా పేరుతో బల్దియా సమావేశాలు, సమీక్షలను అధికార తెరాస వర్చువల్ పద్ధతిలో మొక్కుబడిగా జరిపారని భాజపా ఆరోపిస్తుంది.
ప్రజా సమస్యలపై గలమెత్తనున్న ప్రతిపక్షాలు..
రోడ్లు, వర్షాలు, వరదల ప్రభావ ప్రాంతాల్లో సహాయక చర్యలపై చర్చ జరపాలని భాజపా కార్పొరేటర్లు ఎప్పటినుంచో కోరుతున్నారు. మరొకవైపు అధికారులతో కలిసి తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటిని పరిష్కరించామని మేయర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. కరోనా వాక్సినేషన్తో పాటూ ఒమిక్రాన్ పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికార పార్టీని ప్రశ్నించేందుకు భాజపా కార్పొరేటర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే తెరాస నేతలు సమావేశమయ్యారు. భాజపాకు కౌన్సిల్లో గట్టిగా సమాధానం చెప్పాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను కౌన్సిల్లో వివరించాలని ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సన్నాహాక సమావేశాల్లో పార్టీ అధినాయకులు కార్పొరేటర్లకు హితబోధించారు.
ఇదీ చదవండి: CM KCR fire on BJP: కేంద్రం వైఖరిపై ఈ నెల 20న నిరసనలు.. గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ