అమెరికన్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్.. పేరు చెప్పగానే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఛార్లెస్ డార్విన్, విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్, కవితా రమణన్, గాయత్రీ చక్రవర్తి స్పివక్. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.
కంచు లోహాలపై పరిశోధన...
శారదా శ్రీనివాసన్.. భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత. దక్షిణ భారతదేశ చరిత్రలో ‘మెటల్ అండ్ మెటీరియల్స్’పై పరిశోధన సాగిస్తున్నారు. ప్రఖ్యాత చోళ కాంస్య చిహ్నాలపై అధ్యయనాలు, దక్షిణ భారత వూట్జ్ స్టీల్, కేరళ అద్దాల పనితనం, వారసత్వం, నీలగిరి కుమ్మరి, కమ్మరులు తయారుచేసిన హైటిన్ కాంస్య పాత్రలు, మెగాలిథిక్ అన్వేషణ, పురాతన మైనింగ్ పద్ధతులు వంటి పరిశోధనలెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి. వివిధ శిల్పాలపై ఉన్న వేలిముద్రలపై మెటలర్జికల్ టెక్నిక్స్‌ని వినియోగించి కొత్త విషయాలెన్నో తెలుసుకున్నారు. శారద ఈ రంగంలో చేసిన కృషికి 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
విలక్షణ ప్రతిభాశీలి
శారదా శ్రీనివాసన్ విలక్షణ ప్రతిభాశీలి. నీలగిరి మూలాలున్న శారద తండ్రి ఎంఆర్ శ్రీనివాసన్ అణుశాస్త్రవేత్త, మెకానికల్ ఇంజినీర్. తల్లి పర్యావరణవేత్త, వన్యప్రాణి కార్యకర్త. 80వ దశకంలో శారద ఐఐటీ- బాంబేలో ఇంజినీరింగ్ చేశారు. ఆ సమయంలోనే నలుగురు స్నేహితులతో కలిసి న్యూక్లియర్ వింటర్ అనే ఆంగ్ల చిత్రానికి సహదర్శకత్వం వహించారు. దానిలో కొరియోగ్రఫీతోపాటు నటిగానూ తనని తాను నిరూపించుకున్నారు. ఆ చిత్రం కేన్స్ అవార్డును గెలుచుకుంది. లండన్ విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ చేశాక దక్షిణ భారతదేశ లోహ శిల్పకళా చరిత్రపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు. ఆమెకు భారతీయ సంప్రదాయ కళలంటే మక్కువ. ఆ ఇష్టంతోనే భరతనాట్యంపైనా పట్టు సాధించి, దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలూ ఇచ్చారు. భర్త దిగ్విజయ్... తన విజయాలకు వెన్నుదన్నుగా నిలిచారని చెబుతారామె. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆఫ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్‌లో ప్రొఫెసర్. గ్రేట్ బ్రిటన్ రాయల్ ఆసియాటిక్ సొసైటీ, వరల్డ్ అకాడెమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌ల్లోనూ ఫెలోగా ఉన్నారు. ‘ఈ అకాడమీలో సభ్యురాలిగా ఎన్నిక కావడం నాకు లభించిన గొప్ప గౌరవం. ఇది భారతీయ పరిశోధకులకు, మహిళా సాధకులకు గుర్తింపుగా భావిస్తున్నా’ అంటారామె.
చిక్కులకు లెక్కల పరిష్కారం
కవితా రమణన్.. ప్రాబబిలిటీ థియరిస్ట్. బ్రౌన్ యూనివర్సిటీలో అప్లయిడ్ మ్యాథ్‌మెటిక్స్‌లో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ రిసెర్చ్ ఇన్ మ్యాథమెటిక్స్ (ఐసీఈఆర్‌ఎమ్)కి అసోసియేట్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అప్లయిడ్ మ్యాథ్‌మెటిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన కవితా రమణన్ ఐఐటీ-బాంబే పూర్వ విద్యార్థిని కూడా. 2017 నుంచి ప్రాబబిలిటీ థియరీ (సంభావ్యతా సిద్ధాంతం), స్టొకాస్టిక్ విధానాలపై పనిచేస్తున్నారామె. కవిత ఈ రంగంలో చేసిన సేవలకుగానూ ప్రాబబిలిటీ సొసైటీ నుంచి ఎర్లాంగ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ స్టాటిస్టిక్స్ నుంచి మెడాలియన్‌లు లభించాయి. అలానే సైమన్స్, నేచురల్ సైన్స్‌లో గుగ్గెన్‌హీమ్ ఫెలోషిప్‌లనీ అందుకున్నారామె.
బోధన రంగంపై ఆసక్తి
గతేడాది అమెరికా రక్షణ శాఖ కవితను న్యూటన్ పురస్కారానికి ఎంపిక చేసింది. సాంకేతిక విభాగాల్లో కొన్నాళ్లు పని చేసినా.. బోధనా రంగంపై ఆసక్తితో ప్రొఫెసర్‌గానే కొనసాగుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అండ్ అసోసియేషన్ ఫర్ విమెన్ ఇన్ మ్యాథమేటిక్స్, అమెరికన్ మ్యాథమెటికల్ సొసైటీ వంటి పలు ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కవిత గౌరవ సభ్యురాలిగా ఉన్నారు. గణితానికి తగిన ప్రాచుర్యం లభించాలనే లక్ష్యంతో ‘మ్యాథ్ కోఆప్’ అనే బృందాన్నీ నడిపిస్తున్నారు. దాని ద్వారా ఎన్నో చిక్కు ప్రశ్నలకు సాంకేతికత సాయంతో పరిష్కారాలు కనుక్కుంటున్నారు. ‘నేనెంతో ఇష్టపడిన గణిత బోధనారంగంలో నిలదొక్కుకోవడం ఓ అదృష్టమైతే, ఇప్పుడు వచ్చిన ఈ గుర్తింపు మరో అద్భుతమైన బోనస్. అకాడెమీ సభ్యురాలిగా వివిధ విభాగాలకు చెందిన వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అంటారామె.
సాహితీ రంగంలో సేవ
సాహితీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన మేధావుల్లో గాయత్రీ స్పివక్ ఒకరు. కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన ఆమె పద్మవిభూషణ్ గ్రహీత. సాహిత్య సిద్ధాంతకర్తగా, స్త్రీవాద విమర్శకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ అండ్ సొసైటీ వ్యవస్థాపకురాలైన గాయత్రి ... జాక్ డెరిడా ‘డి లా గ్రమటాలాజీ’ అనువాదం, ‘కెన్ ద సబల్టర్న్ స్పీక్’తో ప్రాచుర్యం పొందారు. మహాశ్వేతాదేవి ఇమాజినరీ మ్యాప్స్, బ్రెస్ట్ స్టోరీస్ వంటి రచనలను తర్జుమా చేశారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కళలు, తాత్వికవాద విభాగంలో 2012లో క్యోటో బహుమతి లభించింది. గాయత్రి స్వస్థలం కోల్‌కతా. పరేస్ చంద్ర, శివానీ చక్రవర్తిలు తన అమ్మానాన్నలు. కోల్‌కతా విశ్వవిద్యాలయంలోని ప్రెసిడెన్సీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె కార్నెల్ యూనివర్సిటీలో ఆంగ్లంలో పీహెచ్‌డీ కోసం అడుగుపెట్టారు.
మైసెల్ఫ్ ఐ మస్ట్ రీమేక్
రుణంతో విదేశీ ప్రయాణం, ఉపకార వేతనం రాకపోవడం వంటి కారణాలతో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ నుంచి అక్కడ కొత్తగా ప్రవేశపెట్టిన తులనాత్మక సాహిత్య విభాగానికి మారారు. అదే ఆమె జీవితంలో మలుపు. అక్కడ ఫ్రెంచ్, జర్మన్ భాషలపై పట్టుసాధించారు. విలియం బట్లర్ ఈట్స్ కవిత్వంపై పరిశోధన ప్రారంభించారు. ఆపై 1965లో అయోవా యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు గాయత్రి. మేధోపరమైన అంశాల్లో రాజీపడకుండా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఒక పుస్తకాన్ని రాయాలనుకున్నారు. అలా రాసిందే ‘మైసెల్ఫ్ ఐ మస్ట్ రీమేక్’. అయోవా యూనివర్సిటీలో తులనాత్మక సాహిత్య విభాగంలో ఎంఎఫ్‌ఏని ప్రారంభించారు. కొన్నాళ్లకు దానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. చికాగో యూనివర్సిటీలో హ్యుమానిటీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ పలు ఫెలోషిప్‌లూ అందుకున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగానే లిటరేచర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్ విభాగంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కి సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: బంధనంలో భారత్- ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా?