ఈ మధ్య కాలంలో ప్రేమ విఫలమై యువకుడు, లేదా యువతి మృతి అనే వార్తలు తరచుగా వింటూనే ఉంటున్నాం. చిన్న వయసులోనే ఆకర్షణకులోనై ఎందరో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమతోపాటు తల్లిదండ్రులకు కూడా శిక్షలు వేస్తున్నారు.
ప్రేమించిన వ్యక్తి ప్రేమను నిరాకరిస్తే తల్లిదండ్రుల గురించి, భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ... కష్టపడి చదవిస్తూ... పిల్లల సంతోషంలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న అమ్మనాన్నలకు తీరని శోకం మిగిలిస్తున్నారు.
అసలైన బాధ వారిదే...
మరికొందరు మద్యానికి బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కొందరు ప్రేమలో విఫలమైతే నిర్దాక్షణ్యంగా ఇష్టపడిన వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమించిన వారిని దక్కించుకోలేని వ్యథలో మీరెంత బాధపడుతున్నారో అనేవాటికి ఇవే నిదర్శనాలు అనుకుంటే పొరపాటే. మీరు చేసే ఈ పనులకు మీ అమ్మనాన్నలు, మీరు చంపేసిన వారి అమ్మనాన్నలు అనుభవించేదే అసలైన శిక్ష. మిమ్మల్ని మార్చేందుకు ప్రయత్నిస్తూ... సమాజం నుంచి ఎదురయ్యే ప్రశ్నల్ని ఎదుర్కొంటూ అంతులేని బాధను వారూ కూడా అనుభవిస్తారు.
వారి గురించి ఆలోచించండి...
ఇలాంటి క్షణికావేశ చర్యలకు పాల్పడే ముందు... మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే అమ్మనాన్నలు, బంధువులు, స్నేహితుల గురించి ఆలోచించండి. ప్రేమించిన వారు దూరమైతే బాధ ఉండటం సహజమే. కానీ ఆ బాధలో మీ ప్రేమను మీ అనుకునే వారికి దూరం చేస్తూ మీరూ అదే తప్పు చేయకండి. ప్రేమించిన వారు దూరమైనా... మంచి భవిష్యత్తుని ఎన్నుకుంటే అదే తల్లిదండ్రులకు ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుంది.
మీరూ అర్థం చేసుకోండి...
కులాలు, మతాలు వేరనో పిల్లల ప్రేమను నిరాకరిస్తే వారు తనువు చాలించిన ఘటనలు చూస్తునే ఉన్నాం. ఒకవేళ పెద్దల్ని ఎదిరించి చేసుకుంటే కడుపున పుట్టిన వారైనా సరే కడతేర్చే చర్యలు చూస్తున్నాం. పిల్లలపై మీకున్న అతిప్రేమ మిమ్మల్ని ఇలాంటి చర్యలకు ప్రోత్సాహించేలా చేస్తోంది. ఆ ప్రేమను అలా కాకుండా వారి ప్రేమను అర్థం చేసుకునేలా మార్చుకోండి. తగిన సలహాలు ఇస్తూ వారిని భవిష్యత్తుకు భరోసానివ్వండి.
చివరిగా...
అమ్మాయిలు... ఎవరినైనా ప్రేమించే ముందు ఇంట్లో పరిస్థితుల గురించి, అబ్బాయి వ్యక్తితత్వం గురించి ముందుగానే ఆలోచించండి. ప్రేమించిన తరువాత అమ్మనాన్నలు ఒప్పుకోరు అంటూ మిమ్మల్ని ఇష్టపడే వారిని బాధించకండి.
అబ్బాయిలు... మిమ్మల్ని ఇష్టపడే అమ్మాయిలను మోసం చేయకండి. మీ ప్రేమ నిజమని నమ్మే వారు మీతో సన్నిహితంగా ఉంటే... వాటితోనే వారిని బ్లాక్ మెయిల్ చేసే ఆలోచనలకు దిగకండి.
ఈ ప్రేమికుల రోజున మిమ్మల్ని ప్రేమించే వారికి ప్రేమను, సంతోషాలను మాత్రమే పంచండి. ఆ ప్రేమతోనే.. మీ తల్లిదండ్రుల గురించీ ఆలోచించండి. ఫైనల్లీ.. హ్యాపీ వాలెంటైన్స్ డే...