రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తూర్పు మధ్యప్రదేశ్ మధ్య భాగంలో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరిగి పశ్చిమ మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశముందని వెల్లడించింది.
ఈ అల్పపీడనం వల్ల శుక్రవారం సాయంత్రం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
- ఇదీ చూడండి : నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు