Promotions Issue in Police Department: తెలంగాణ పోలీస్‌శాఖలో మరోసారి పదోన్నతుల రగడ రాజుకొంది. రాష్ట్రంలో పలువురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు హోంశాఖ కసరత్తు చేస్తుండటంతో వివాదం తెరపైకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవో నం.153 ఇందుకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోషనల్ సీనియారిటీ రూపొందిస్తూ వెలువడిన ఆ జీవోలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని.. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రేంజ్‌లోని 1991 బ్యాచ్(ఎస్సై) డీఎస్పీలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తోంది. ఆ జీవో ప్రకారం పదోన్నతులు కల్పిస్తే ఉమ్మడి హైదరాబాద్ రేంజ్‌లోని 1995 బ్యాచ్‌కు చెందిన అధికారులు తమకు బాస్‌లుగా మారే అవకాశాలున్నాయని వారు వాపోతున్నారు. ఇదే జరిగితే గతంలో తమ వద్ద జూనియర్లుగా పనిచేసిన వారికి సెల్యూట్ చేయాల్సి వస్తుందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాడు నాలుగేళ్లలో ఖాళీలే లేవట : సీఐల వరకు పదోన్నతులు ఆయా రేంజ్‌ల పరిధిలోనివేే కావడంతో ఇబ్బందులు తలెత్తేవి కావు. ఎప్పుడైతే డీఎస్పీలుగా పదోన్నతులు పొందుతారో అప్పుడు రేంజ్ దాటి రాష్ట్రం పరిధిలోకి రావడంతోనే సీనియారిటీ చిక్కులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి హైదరాబాద్, వరంగల్ రేంజ్‌ల్లోని ఖాళీల్లో అసమానతలే ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి వరంగల్ రేంజ్‌తో పోల్చితే ఉమ్మడి హైదరాబాద్‌లో సైబరాబాద్, రాచకొండలాంటి కొత్త పోలీస్ యూనిట్లు ఏర్పాటవడంతో ఇక్కడ పోస్టులు పెరిగి పెద్దఎత్తున ఖాళీలకు ఆస్కారమేర్పడింది. దీంతో ఉమ్మడి హైదరాబాద్ రేంజ్‌లోని జూనియర్లే.. ఉమ్మడి వరంగల్ రేంజ్‌లోని సీనియర్లకన్నా ముందుగా పదోన్నతులు పొందడం తరచూ వివాదాలు రాజేస్తోంది.
ఉమ్మడి వరంగల్ రేంజ్‌లోని 1995 బ్యాచ్ కన్నా ఉమ్మడి హైదరాబాద్ రేంజ్‌లోని 1996 బ్యాచ్ అధికారులే ముందుగా డీఎస్పీలుగా పదోన్నతులు పొందడం ఈ కోవలోనిదే. ఉమ్మడి వరంగల్ రేంజ్‌లో ఖాళీల్లేకపోవడంతో 1991 బ్యాచ్ ఎస్సైలు డీఎస్పీలుగా పదోన్నతి పొందేందుకు ఏకంగా 17 ఏళ్లు పట్టింది. 1988-92 మధ్య ఉమ్మడి వరంగల్ రేంజ్‌లో ఒక్క ఖాళీ లేదని అప్పట్లో పేర్కొనడమే సమస్యను రాజేసింది. ఈనాలుగేళ్లలో ఉమ్మడి వరంగల్ రేంజ్‌లో పలువురు డీఎస్పీలు పదవీ విరమణ చేయడంతోపాటు ఎన్‌కౌంటర్లలో మరణించినా ఖాళీల్లేవని చెప్పడం వెనక కుట్ర చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికైనా 153 జీవోను సవరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈదిశగా న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో రేంజ్‌ల వారీగా కాకుండా బ్యాచ్‌లవారీగా పదోన్నతులు కల్పిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చదవండి: