దేశంలో ప్రైవేటు రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌తో ఏర్పడిన అపెక్స్ బాడీ కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడాయ్.. హైదరాబాద్ ప్రాపర్టీ షో 9వ ఎడిషన్‌ను ప్రారంభించింది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రాపర్టీ షోలో నగరవ్యాప్తంగా రియల్టర్లు, బిల్డింగ్ మెటీరియల్ తయారీదారులు, కన్సల్టెంట్లు, ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్స్ ఒకే గొడుగు కింద ప్రదర్శిస్తున్నారు. గృహ రుణాలకు సంబంధించి మొత్తం 80కి పైగా స్టాళ్లు కొలువుదీరాయి.
రియల్ ఎస్టేట్: ఒడుదొడుకులున్నా.. సత్తా చాటుతోంది..
దేశ రియల్ ఎస్టేట్ రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నా.. హైదరాబాద్‌లో రియల్ రంగం ఆశాజనక ప్రగతితో సత్తా చాటుతోందని మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కితాబిచ్చారు. కేవలం భవన నిర్మాణాలు, వాటి అమ్మకాలకే పరిమితం కాకుండా.. స్డేడియాలను సీఎస్ఆర్ నిధులతో అబివృద్ధి చేయాలని, స్పోర్ట్స్ క్లబ్‌లు నిర్మించాలని సూచించారు.
అభివృద్ధి నలుమూలలా విస్తరించాలి
పశ్చిమ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. హైదరాబాద్ నలుమూలలా రియల్ రంగం విస్తరించేలా ముందుకెళ్లాలని కేటీఆర్ రియల్ వ్యాపారులకు సూచించారు. భవన నిర్మాణరంగంలో ఇక్కడి కార్మికులను తీసుకునేలా బిల్డర్లు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు.
బిల్డర్లు స్వీయనియంత్రణ పాటించాలి
మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్‌కు ఇప్పటికే మంచి పేరుందని.. ఆ ఖ్యాతిని, పేరును తగ్గించకుండా బిల్డర్లు నడుచుకుంటూ స్వీయనియంత్రణ పాటించాలన్నారు. బిల్డింగ్ పర్మిషన్ల కోసం టీఎస్ బీ పాస్‌ను త్వరలో తీసుకువస్తామని పేర్కొన్నారు.