తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర రంగాల్లో ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేయడంతో పాటు తెలుగును ఆధునిక విజ్ఞాన, బోధన భాషగా అభివృద్ధి చేసేందుకు 1985 డిసెంబరు 2న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పేరులో తెలుగు ఉన్నా భాషను బోధించే ఆచార్యులే కరవయ్యారు. ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు భర్తీ కాక బోధన కుంటుపడింది. చివరికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించలేని పరిస్థితికి చేరుకుంది. వర్సిటీలో 82 మంది ఆచార్యులకుగాను కేవలం 14 మందే పనిచేస్తున్నారు.
ఐదు విభాగాల్లో సున్నా!
విశ్వవిద్యాలయంలో ఏళ్లుగా ఆచార్యుల నియామక ప్రక్రియ జరగలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించక విభాగాలకు విభాగాలే ఖాళీ అయ్యాయి. ఐదు డిపార్టుమెంట్లలో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు కూడా లేరు. తెలుగు విభాగం పూర్తిగా మూతపడింది. ప్రతి విభాగంలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిసెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కొన్ని విభాగాలు ఒక్కరూ లేక మూతపడగా మరికొన్ని ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు.
ఆచార్యులు లేక విభాగాల మూత
డిపార్టుమెంట్ ఆఫ్ తెలుగు, జ్యోతిషం, లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్‌లేషన్స్ డిపార్టుమెంట్(ఇంగ్లీషు, సంస్కృతం), ఎన్‌సైక్లోపిడియా, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. వీటితోపాటు ఫోక్ ఆర్ట్స్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లోఒక్కరే ఆచార్యులు ఉన్నారు. వీరు ఉద్యోగ విరమణ చేస్తే ఆ విభాగాలు మూతపడ్డట్లే.
దూరవిద్యకు ఆటంకం
ఆచార్యుల పోస్టుల ఖాళీ కారణంగా రెండేళ్లుగా దూరవిద్య ప్రవేశాలకు నోచుకోవడం లేదు. విభాగాల్లో కనీస ఆచార్యులు లేని కారణంగా 2018-19 నుంచి దూరవిద్య ప్రవేశాలకు యూజీసీ ఆధ్వర్యంలో పనిచేసే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో అనుమతి ఇవ్వడం లేదు. ఈ మేరకు కేవలం సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల్లోనే ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఏటా దూరవిద్య ప్రవేశాల కారణంగా ఫీజుల రూపేణా దాదాపు రూ.1.20కోట్ల ఆదాయం సమకూరేది. మూడేళ్లుగా ఆ ఆదాయానికి గండి పడింది. తెలుగు వర్సిటీ అందించే ఎంసీజే కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో కోర్సులో చేరుతుంటారు. దూరవిద్యలో కోర్సులో ప్రవేశాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ విభాగంలో ఆచార్య సత్తిరెడ్డి ఒక్కరే ఉన్నారు.
చెప్పేదే కొండంత.. ఇచ్చేది గోరంత..
కొన్నేళ్లుగా ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి నిధులు ఇవ్వడంతో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. కొండంత ఇస్తామని చెబుతున్నా.. వాస్తవానికి వచ్చేసరికి గోరంత అన్నట్లుగా ఉంటోంది. కేవలం జీతాలకు ఇచ్చే నిధుల విడుదల చేస్తున్న పరిస్థితి. అరకొర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీల్లేకుండా మారింది. కోర్సులకు తగ్గట్టుగా సాంకేతికతను పెంపోందించుకోవడం జరగడం లేదు. కొత్త భవనాల నిర్మాణం ముందుకు సాగడం లేదు. వసతిగృహాలు సరిపడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
ఇదీ చదవండిః స్వచ్ఛ భారత్’లో మూడోసారి సత్తాచాటిన తెలంగాణ