రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. సాంకేతిక అడ్డంకులూ తొలగిపోవడంతో వీలైనంత త్వరలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరో వారంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.
తెలంగాణ ఏర్పడ్డాక 2014, 2018 సంవత్సరాల్లో పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు జరిగాయి. 2018లో రికార్డు స్థాయిలో 18 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీచేసి విజయవంతంగా నియామక ప్రక్రియను పూర్తిచేశారు. మరో విడత పోలీసు నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పోలీసుశాఖ తరఫున ప్రతిపాదనలు పంపారు. ఎస్సై స్థాయిలో 360 సివిల్, 29 ఏఆర్, 20 కమ్యూనికేషన్స్, కానిస్టేబుల్ స్థాయిలో 7,700 సివిల్, 6,680 ఏఆర్, తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం (టి.ఎస్.ఎస్.పి.)లో 3,850, 15వ బెటాలియన్‌లో 560, కమ్యూనికేషన్స్ విభాగంలో 250 కానిస్టేబుళ్లు మొత్తం 19,449 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు.
గత డిసెంబర్లోనే ప్రభుత్వం దీనిని ఆమోదించింది. అప్పటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. కానిస్టేబుల్ పోస్టులు జిల్లా స్థాయివి కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని భావించారు. దీనివల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. తర్వాత కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈలోగా కరోనా విజృంభించడంతో అధికారులు, సిబ్బంది లాక్‌డౌన్ తదితర విధుల్లో తలమునకలయ్యారు. మళ్లీ ఇప్పుడు నియామకాల కసరత్తు మొదలుపెట్టారు.
మరింత సరళతరం..
ఈసారి నియామక ప్రక్రియను సరళతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే సమయంలో పలు తప్పులు దొర్లేవి. వాటిని సరిదిద్దుకోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈసారి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీసు నియామకాల కోసం యాప్ తయారు చేసే ఆలోచనతో ఉన్నారు.
ఇదీ చూడండి: సంతోశ్‌బాబు విగ్రహావిష్కరణ చేయనున్న మంత్రి కేటీఆర్