స్వామి వివేకానందుడి బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు, యువతకు గవర్నర్ తమిళిసై సూచించారు. వివేకా స్ఫూర్తితో కృషి చేసి తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలని కోరారు. యువతలో ఆత్మహత్య ఘటనలు పెరుగుతుండటం పట్ల ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంతో ఎదుర్కుని విజయం సాధించేందుకు వివేకా బోధనలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం..
వివేకానందుడి చారిత్రాత్మక చికాగో ఉపన్యాసం 127వ వార్షికోత్సవం సందర్భంగా రామకృష్ణ మఠం, వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్ సంస్థలు సంయుక్తంగా సంప్రీతి దినోత్సవం నిర్వహించాయి. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అందువల్ల పునరుత్తేజితం..
తాను ఎప్పుడైనా నిరాశకు గురైతే, స్వామి వివేకానందుడి రచనలు చదివి పునరుత్తేజితం అవుతానని గవర్నర్ ఊదాహరించారు. సమస్త శక్తి మనలోనే దాగుందని, సంకల్పం ఉంటే యువత అనుకున్నది సాధించొచ్చని స్వామి వివేకానంద చెప్పిన సూక్తులు అత్యంత స్ఫూర్తిదాయకమైనవని గవర్నర్ పేర్కొన్నారు.
నిరంతరం స్ఫూర్తి
తాను 4వ తరగతి చదువుతున్నప్పుడు తన తండ్రి వివేకానందుడి పుస్తకం బహుకరించారని తెలిపారు. అప్పటి నుంచి తాను వివేకా మాటలు, రచనల ద్వారా నిరంతరం స్ఫూర్తి పొందుతున్నానని ఆమె వివరించారు.
ఇప్పటికీ అనుసరణీయమే..
127 ఏళ్ల కిందట చికాగాలో వివేకానందుడు భారతీయ వేదాంత చింతన గురించి గర్జించారని, ఆయన మాటలు ఇప్పటికీ అనుసరనీయమని తమిళిసై కీర్తించారు. ప్రపంచ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్‌లో స్వామి వివేకానందుడు చేసిన ప్రసంగాల్లో మూఢత్వాన్ని, ద్వేషాన్ని వదలాలని చెప్పడం అతి ముఖ్యమైన అంశాలుగా ఆమె కొనియాడారు.