ప్రజల్లో సామాజిక చైతన్యం తగ్గిపోతే అసమానతలు ఏర్పడుతాయని రాష్ట్ర వైద్యారోగ శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా లక్డీకపూల్లో ఓ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. మతతత్వ రాజకీయాలు- తెలంగాణ వాదులు అనే అంశంపై ఆయన మాట్లాడారు.
స్వాతంత్య్రం వస్తే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయన్న అంబేద్కర్ ఆశయం నీరుగారిపోతోందని ఈటల అన్నారు. దేశానికి మహానీయులు అందించిన స్ఫూర్తిని భావితరాలకు అందించాలని మంత్రి తెలిపారు. ప్రధాని మోదీ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. పార్లమెంట్లో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా ఉంటూ తమ డిమాండ్లను నేరవేర్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు.