Agnipath News : సికింద్రాబాద్ విధ్వంసం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్లుగా ఉన్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు గుర్తించారు. ఏ సమయంలో ఎక్కడికి చేరుకోవాలి.. రైల్వే స్టేషన్లోకి ఎలా వెళ్లాలనే ప్రణాళికను సిద్ధం చేసుకొని.. వాట్సాప్ ద్వారా యువకులకు సమాచారం చేరవేశారని పోలీసులు తేల్చారు. పెట్రోల్ బాటిళ్లతో స్టేషన్లోకి ప్రవేశించిన వారు ముందే విధ్వంసానికి పథకరచన చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఆందోళనకారుల వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఉత్తరాదిలో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. సదరు నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు. ఈఘటనలో ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్ర ఉందని తేలితే వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసు దర్యాప్తును పరిశీలించాలని ఇప్పటికే అదనపు సీపీ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణను సీపీ సీవీ ఆనంద్ ఆదేశించారు. రైల్వే పోలీసులు ఈ కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ కేసును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేసి విచారణ వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
మరోవైపు అగ్నిపథ్ విధానాన్ని నిరసిస్తూ ఆర్మీ అభ్యర్థులు, ప్రజా సంఘాలు ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు, రైళ్లు యధావిధిగా రాకపోకలు సాగిస్తుండటంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.