PD Act in telangana: తెలంగాణ పోలీసులకు పీడీ చట్టం ఓ అస్త్రంలా మారింది. నేర నియంత్రణలోనే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కేసుల్లోనూ ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇది పాత చట్టమే అయినా వ్యవస్థీకృత నేరాల నియంత్రణకు దీన్ని ఆయుధంగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త కమిషనరేట్ల ఏర్పాటుకు బీజం పడింది. ఒకరకంగా పీడీ చట్టం ప్రయోగించడంలో వెసులుబాటు కోసమే కమిషనరేట్లు ఏర్పాటయ్యాయనే అభిప్రాయం లేకపోలేదు. జిల్లాల్లో అయితే ఈ చట్టం ప్రయోగించేందుకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి. అదే కమిషనరేట్ అయితే సంబంధిత పోలీస్ కమిషనర్‌కు ఆ అధికారముంటుంది. ఈ నేపథ్యంలోనే రౌడీలు, గుండాలు, గొలుసు దొంగలు, జూద గృహ నిర్వాహకులు, నకిలీ విత్తనాల తయారీదారులు, సైబర్ నేరస్థులు.. ఇలా ఒకరేమిటి వ్యవస్థీకృతంగా నేరాలకు పాల్పడే ఏ ఒక్కరినీ వదలకుండా ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.
ఏడాది జైల్లో ఉండాల్సిందే.. సాధారణంగా పీడీ చట్టం ప్రయోగించాలంటే వరుస నేరాలకు పాల్పడుతుండాలి. లేదా నిందితుడి చర్యలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుండాలి. ఆరు నెలల్లో కనీసం మూడు కేసులు నమోదైన వారిపైనే ఈ చట్టం ప్రయోగించాలి. ఈ కేసు పెడితే ఏడాది పాటు కారాగారవాసం తప్పదు. అంటే అప్పటి దాకా బెయిల్ దొరకదు. అయితే ఈ చట్టాన్ని సమీక్షించుకునే వెసులుబాటు నిందితులకు ఉంటుంది. ఈ చట్టాన్ని ప్రయోగించే ముందే కారణాలు వివరిస్తూ రూపొందించిన దస్త్రాన్ని నిందితుడికి అందజేస్తారు. అనంతరం జైలుకు పంపిస్తారు. తర్వాత అడ్వయిజరీ బోర్డులో వాదనలు నడుస్తాయి. పోలీసుల చర్యను బోర్డు సమర్థిస్తే పీడీ చట్టం కొనసాగుతుంది. నిందితుడు హైకోర్టులో అప్పీలు చేసుకునే వీలుంటుంది.
దేశంలోనే ఈ చట్టం అమలులో ముందు.. గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో ఏకంగా 2,500కు పైగా నేరస్థులపై ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఒకరకంగా దేశంలోనే ఈ స్థాయిలో చట్టాన్ని ప్రయోగించిన పోలీస్‌శాఖ మరోటి లేకపోవడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ఈ చట్టం ప్రయోగం వివాదాస్పదమైన దాఖలాలూ లేకపోలేదు.
ఇవీ చూడండి.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు, పీడీ యాక్ట్ కింద చర్లపల్లికి తరలింపు