రాష్ట్రంలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి.. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భద్రాచలంలో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 18.2 డిగ్రీలు నమోదైననట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది.
మున్ముందు మరింతగా..
రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18 నుంచి 24 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. శని, ఆదివారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో కనిష్ఠంగా 22 నుంచి 25 డిగ్రీలు కాగా... గరిష్ఠంగా 37 నుంచి 39 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
ఇదీ చదవండి: ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా