కొవిడ్ పరిస్థితుల వల్ల విద్యా సంవత్సరం గందరగోళంగా మారినందున పదో తరగతి పరీక్షల విధానంలో పలు మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధివిధానాలు ఖరారు చేస్తూ విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతిలో ఇప్పటి వరకు ఉన్న 11 పరీక్షలను ప్రభుత్వం ఆరుకు కుదించింది. ద్వితీయ భాష మినహా మిగతా ఐదు సబ్జెక్టులకు ఇంతకు ముందు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో పరీక్షలో 40 మార్కులు ఉంటున్నాయి. ఈ ఏడాది ప్రథమ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డుకు విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగించారు. ఇంతకు ముందు 2 గంటల 45 నిమిషాల పాటు పరీక్ష ఉండగా.. ఈ ఏడాది 3 గంటల 15 నిమిషాలు ఉండనుంది. సైన్సు పరీక్షలో విద్యార్థులకు రెండు సమాధాన పత్రాలు ఇస్తారు. ప్రశ్నపత్రం పార్ట్ ఏలోని భౌతిక శాస్త్రం ప్రశ్నలకు సమాధానాలు ఒకదానిలో, పార్ట్ బీలోని జీవశాస్త్రం సమాధానాలు మరో దానిలో రాయాలి. మార్కుల విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని విద్యా శాఖ స్పష్టం చేసింది.
మార్కులు యథాతథం
ఎఫ్ఏ పరీక్షలకు 20, బోర్డు పరీక్షకు 80 మార్కులు యథాతథంగా ఉంటాయని తెలిపింది. మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ఎస్ఎస్సీ బోర్డు త్వరలో ఖరారు చేయనుంది.
ఇవీ చదవండి: ఒప్పంద లెక్చరర్ల పిటిషన్ కొట్టివేత