నాటు వైద్యమన్నాడు...ఓ చిన్నారి మృతికి కారణమయ్యాడు! నాటు వైద్యం ఓ బాలుని మృతికి కారణమైంది. అర్హత లేకపోయినా వైద్యుని అవతారమెత్తి నిండు ప్రాణాలను బలిగొన్నాడు ఓ నాటు వైద్యుడు. ఆయుర్వేదంలో ఎయిడ్స్ కు మందు కనిపెట్టా ... అన్నిరకాల జబ్బులు తగ్గిస్తానంటూ భూమేశ్వరరావు యూట్యూబ్లో పబ్లిసిటీ ఇచ్చాడు. కండరాల క్షీణతను 15 రోజుల్లో తగ్గిస్తానంటూ సామాజిక మాద్యమాల్లో అదరగొట్టాడు. వీడియోలు చూసిన బాధితులు ఫోన్ ద్వారా సంప్రదించారు. 11 మందిని నగరానికి రప్పించాడు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గంగోత్రి లాడ్జి వసతి సౌకర్యం ఏర్పాటుచేసి నాటు మందులను వ్యాధిగ్రస్తులకు ఇచ్చాడు. రెండో రోజు మందులు తీసుకున్న తర్వాత హఠాత్తుగా హరిధర నాయుడు అనే బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమందించారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల నుంచి వైద్యం కోసం వచ్చారు. గతంలో ఇదే తరహాలో కొంతమందికి వైద్యం చేసి జబ్బు నయం చేయటంతో తాము వచ్చామని బాధితులు చెబుతున్నారు. ఆయుర్వేదం గుళికలు ఇవ్వటం వల్లే తన మనవడు చనిపోయాడని మృతుని నాయనమ్మ ఆరోపిస్తోంది. రోజూ ఇచ్చే మోతాదు కంటే అధికంగా గుళికలు ఇవ్వటంతోనే బాలుడు మృతి చెందాడని బాధితులు ఆరోపిస్తున్నారు .
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడు డాక్టర్ భూమేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆయుర్వేద వైద్యుడునని అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తున్న భూమేశ్వరరావు పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇదీ చదవండి: తునిలో విలేకరి దారుణ హత్య