'ఈ సృష్టిని నేనే సృష్టిస్తున్నా.. సకల జీవరాశుల తలరాతలు రాసేది నేనే.. కాబట్టి నేనే గొప్ప' అంటాడు బ్రహ్మ. 'నువ్వు కూర్చున్న చోటు నుంచి కాలు కదపకుండా రాస్తే సరిపోయిందా.. లోకాలన్నింటినీ రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను. కాబట్టి నేనే గొప్ప' అంటాడు విష్ణువు. వీరిద్దరి తగువును తీర్చే బాధ్యత తీసుకున్న శివుడు.. 'ఫలానా చోట ఒక అగ్నిస్తంభం ఉంది. దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప.. ఇక బయలుదేరండి' అని చెప్తాడు శివుడు. అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోడానికి బ్రహ్మ విష్ణువులు బయల్దేరుతారు. ఆది కనుక్కోడానికి బ్రహ్మ, అంతం తెలుసుకోడానికి విష్ణువు శోధన మొదలుపెడతారు.
అంతా శివమయమే..
ఎంత ప్రయత్నించినా.. దాని అంతం ఎక్కడో విష్ణుమూర్తి కనుక్కోలేక ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయల్దేరుతాడు. దారిలో.. బ్రహ్మ కామధేనువును, మొగలిపువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నా అని చెప్తాడు. ఇద్దరూ ఒకచోట చేరిన తర్వాత ఆ అగ్నిస్తంభం తానేనని.. దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు. దీంతో.. తామిద్దరి కంటే శివుడే.. గొప్పవాడని అంగీకరించిన బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై 'అన్నీ నేనే.. అంతటా నేనే.. నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుంది' అని చెప్తాడు.
అదే శివరాత్రి..
శివుడు అలా లింగరూపంలో ఉద్భవించిన రోజు.. మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగరూపంలో ఉద్భవించాడు. ఆ రోజు నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహా శివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. శివరాత్రి నాడు.. శివలింగానికి రుద్రాభిషేకం చేసి.. ఉపవాసం, జాగారం ఆచరిస్తే.. అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు.
ఇదీ చూడండి : హైదరాబాద్ నగర శివార్లలో మంచు తడి