Government teachers: ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు ఆందోళన బాట పట్టారు. ఒకే చోటా విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని కోరుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కదం తొక్కారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. వేర్వేరు ప్రదేశాల్లో విధులు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ దంపతులు బోనాలతో ప్రదర్శన నిర్వహించారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. భార్యభర్తలు ఒకే దగ్గర కాకుండా వేరే జిల్లాల్లో పని చేయడం వల్ల.. సమస్యలు ఎదరువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. దంపతులను ఒకే జిల్లాలో పని చేసే అవకాశం కల్పించాలని ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు.
డీఈఓ ఆఫీసు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌లో కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వేర్వేరు ప్రదేశాల్లో పనిచేయడం వల్ల తమ పిల్లలను సరిగా చూసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కుటుంబాల సభ్యులతో కలిసి ఉపాధ్యాయ దంపతులు ధర్నా నిర్వహించారు. 19జిల్లాల్లో బదిలీలకు అనుమతించి.. 13జిల్లాల ఉద్యోగుల్ని మాత్రం ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా అని ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. న్యూటౌన్ కూడలి నుంచి తెలంగాణ చౌరస్తా వరకూ ప్రదర్శన నిర్వహించారు. జీవో317 ద్వారా ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని లేదంటే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
"19 జిల్లాల స్పౌజ్ బదిలీలు ఎలా చేపట్టారో ..13 జిల్లాలకు ఆవిధంగా చేపట్టాలి. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వేరే జిల్లాలో ఉద్యోగం చేయడం వల్ల ఒత్తిడికి లోనవుతున్నాం. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి" - ఉపాధ్యాయులు
ఇవీ చదవండి: అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట