వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టింది. మళ్లీ పరిశీలించి మూడు నెలల్లో తాజా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. చట్ట సంబంధమైన అంశాలు పరిశీలించకుండానే... కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు ధర్మాసనం అభిప్రాయపడింది. మూడు వారాల్లో తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలపాలని చెన్నమనేని రమేష్, ఆది శ్రీనివాస్‌లకు సూచించింది.
ప్రజాప్రతినిధి అని గుర్తించలేదు
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం చెల్లదంటూ ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కేంద్ర హోంశాఖ ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టును ఆశ్రయించారు. తాను ప్రజాప్రతినిధి అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హోం శాఖ తీరును తప్పుపడుతూ... మూడు నెలల్లో తాజా నిర్ణయం వెలువరించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి : 'ఆ నిర్ణయం చట్టవ్యతిరేకం కాదు'