కరోనాతో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను త్వరలో నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటి దాకా పరీక్ష రాసే విద్యార్థుల మధ్య దూరం మూడ అడుగుల మేర ఉండగా దాన్ని ప్రస్తుతం ఐదు నుంచి ఆరు అడుగులకు పెంచారు. ఈ మేరకు అదనపు పరీక్ష కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. తొలుత పరీక్ష రాసిన సమయంలో గల హాల్‌టికెట్ ఆధారంగానే, దానిపైన ఉన్న పరీక్షా కేంద్రం వద్దే అదనంగా మరోటి సిద్ధం చేస్తున్నారు. వీటిని పరీక్షా కేంద్రం సెంటర్-1, సెంటర్-2గా నామకరణం చేస్తున్నారు.
ఖైరతాబాద్ జోన్లో 58 కేంద్రాలు
ఖైరతాబాద్ జోన్ పరిధిలో తొలుత పరీక్షా కేంద్రాలు మొత్తం 29 ఉన్నాయి. కొత్త నిబంధనల మేరకు విద్యార్థుల మధ్య ఎడం ఉంచేలా కేంద్రాల సంఖ్య 58కి పెరిగింది. అదనపు కేంద్రాల్లో 24 అదే పాఠశాల భవనంలో ఖాళీగా ఉన్న ఇతర గదుల్లో సర్దుబాటు చేస్తున్నారు. మిగతావి మాత్రం సమీపంలోని మరో పాఠశాలకు మారుస్తున్నారు. గతంలో ఫెయిలై కంపార్టుమెంట్ కింద పరీక్ష రాస్తున్న విద్యార్థులకు రెండు సెంటర్లు ఉండగా వాటిని నాలుగుకు పెంచారు. పరీక్ష కేంద్రం మార్పులపై ఇన్‌ఛార్జి అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వనున్నారు.
మరో పాఠశాలకు మారిన కేంద్రాలివే
ఐదు కేంద్రాల్లో అదనపు గదులు అందుబాటులో లేక సగం విద్యార్థులను సమీపంలోని మరో పాఠశాలను కేంద్రంగా ఏర్పాటు చేసి అక్కడ పరీక్షను రాయించనున్నాయి ఆ పరీక్ష కేంద్రాలు
- రహ్మత్‌నగర్ కృష్ణవేణి స్కూల్లోని సగం మంది విద్యార్థులను సమీపంలోని ఎంఎంటీజీ పాఠశాలకు మార్చారు
- రహ్మత్‌నగర్ శాంతి విద్యానికేతన్ సెంటర్లోని విద్యార్థులను సమీపంలోని న్యూటన్ హైస్కూల్‌కు మార్చారు
- శ్రీరాంనగర్ విజ్డమ్ సెంటర్ విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు కేటాయించారు.
- ఎర్రమంజిల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రం విద్యార్థులను సమీపంలోని రవీంద్ర నికేతన్‌లో సర్దుబాటు చేశారు.
- టోలిచౌకి డైమండ్ జూబ్లీ హైస్కూల్ కేంద్రంలోని విద్యార్థులను సమీపంలో ఇన్స్పైర్ డిజీ పాఠశాలలోకి మార్చారు.
పరీక్షా కేంద్రంలో కరోనా కట్టడికి చర్యలు
కరోనా కట్టడికి పరీక్షా కేంద్రాల్లో అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ప్రతి పరీక్షా కేంద్రానికి శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, థర్మల్ స్కానర్లు, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం అందజేస్తున్నారు. వీటిని శుక్రవారం పలు పరీక్షా కేంద్రాలకు అందజేశారు. మిగిలిన వాటికి ఇవాళ అందజేయనున్నారు.
ఖైరతాబాద్ జోన్లో 8,405 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు. ఇందులో ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకులాలు, ప్రైవేటు విద్యార్థులతో పాటు కంపార్టుమెంట్ వారూ ఉన్నారు.