అద్దె బస్సులకు జిల్లాల్లో భారీ స్పందన లభించగా... గ్రేటర్ పరిధిలో మాత్రం కరవైంది. 1,035 బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటికోసం కొన్ని మార్గాలను కూడా ఖరారు చేసింది. టెండర్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసే సమయానికి సుమారు పదివేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
కార్మికుల ప్రతిఘటన
టెండర్ల దాఖలు సందర్భంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కార్మికులు ప్రతిఘటించారు. అద్దె బస్సులు తీసుకోవద్దని డిమాండ్ చేశారు. పాత గుత్తేదారులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారంటూ... టెండర్లు దాఖలు చేసేందుకు వచ్చినవారు కరీంనగర్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులను అధికారులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు.
అందరూ జిల్లాలకే మొగ్గు
ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించిన 1,035 బస్సుల్లో... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 760, జిల్లాల్లో 257 బస్సులు ఉన్నాయి. జిల్లాల్లో సగటున 45 నుంచి 50 బస్సుల వరకు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వేల సంఖ్యలో టెండర్లు దాఖలయ్యాయి. బస్సుల సంఖ్య కన్నా టెండర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు గిట్టుబాటు కావంటూ బస్సు యజమానులు ఆసక్తి చూపలేదు. కేవలం 18 బస్సులకు మాత్రమే దరఖాస్తులు రావటం విశేషం.
ఇదీ చూడండి: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట.. టెండర్ల నిలిపివేత