తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 5 నుంచి 6 డీగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు బేగంపేట విమానాశ్రయంలో 12.4 డీగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందన్నారు.
ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని తెలిపారు. వీటి వల్ల ఉత్తర, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం చూపవచ్చన్నారు. రాబోయే రోజుల్లో తూర్పు నుంచి వచ్చే గాలులతో కొద్దిగా చలితీవ్రత తగ్గవచ్చని రాజారావు వెల్లడించారు.