తమిళ సాహిత్యానికి, కవులకు ఉన్న గౌరవం ప్రాధాన్యత... తెలుగు సాహిత్యానికి, కవులకు లేకపోవడం బాధాకరమని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు కీర్తి శిఖర జీవన సాఫల్య పురస్కారం ప్రదానోత్సవం జరిగింది.
తమిళ, మరాఠీ భాషల సాహిత్యాలకు ఆయా రాష్ట్రాలలో ప్రాముఖ్యత లభిస్తుందని... వేరే భాషలలో అనువాదం అవుతూ అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నాయని ఘంటా చక్రపాణి తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందడం లేదని... రచయితలకు గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు సాహిత్యానికి అవార్డులతో సత్కరిస్తూ... రచయితలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో తెలుగు సాహిత్య అకాడమీ, సాహిత్య సంస్థలు అవార్డులు, ప్రోత్సాహకాలు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
తెలుగు విశ్వవిద్యాలయం ఇస్తున్న అవార్డులలో కూడా సరైన ప్రమాణాలు పాటించడంలేదని పేర్కొన్నారు. రచయితలను గుర్తించి భూపతి చంద్ర మెమోరియల్ ట్రస్ట్ అవార్డులు ఇవ్వడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్‌ను ఘంటా చక్రపాణి శాలువ, అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'అదనంగా ఒక్క రూపాయి ఖర్చు చేయొద్దు'