Temperature drops Telangana: ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పడిపోతుండటంతో తెలంగాణ శీతలగాలుల గుప్పిట చిక్కుకుంది. మంగళవారం తెల్లవారుజామున కుమురం భీం జిల్లా గిన్నెధరిలో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత 125 ఏళ్ల వాతావరణ చరిత్రలో ఇంత అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవడం ఇది రెండోసారి మాత్రమే. 1897 నుంచి ఇప్పటివరకూ ఉష్ణోగ్రతల రికార్డులను పరిశీలిస్తే.. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 2017 డిసెంబరు 27న 3.5, అంతకుముందు నిజామాబాద్‌లో 1897 డిసెంబరు 17న 4.4, హైదరాబాద్‌లో 1946 జనవరి 8న 6.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు నుంచి నాలుగు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డిలో 8.4, హైదరాబాద్‌లో 9.5 కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదయ్యాయి. అతి తక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎందుకింత చలి...?
Temperature falling: ఇరాన్, ఇరాక్ ప్రాంత వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఉత్తర భారతంపై గాలుల్లో అస్థిరత ఏర్పడిందని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న పేర్కొన్నారు. వీటి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉత్తర భారతంలో హిమాలయ సానువుల్లో బాగా మంచు కురుస్తోందని చెప్పారు. అక్కడి నుంచి దక్షిణ భారతం వైపు శీతల గాలులు వీస్తున్నందున వాటి ప్రభావంతో తెలంగాణ అంతటా చలిగాలులు వీస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3.5 నుంచి 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత ఉంటోందని, ఈ నెల 27 వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేశారు. చలికన్నా గాలులతో శీతల వాతావరణం ఏర్పడుతోందని వెల్లడించారు.
ఇదీ చదవండి: మూడు రెట్లు వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక