Massmutual india in hyderabad: దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లో వ్యాపారానికి అనేక అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికాకు చెందిన మాస్ మ్యూచువల్ ఇండియా కార్యాలయాన్ని హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో కేటీఆర్ ప్రారంభించారు. యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మాన్, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్చూన్ 100 కంపెనీగా ఉన్న మాస్ మ్యూచ్‌వల్ సంస్థ హైదరాబాద్‌కు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలు విస్తరించేందుకు సంస్థలు ముందుకురావాలని కోరారు.
50 వేల ఉద్యోగాలు లక్ష్యం
'ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ సేవల విస్తరణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో వచ్చే ఐదేళ్లలో 50వేల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే టెక్ మహీంద్రా, సైయంట్, మైండ్ ట్రీ సహా తాజాగా జెన్‌ప్యాక్ట్ వరంగల్‌కు వచ్చాయి.' -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
ద్వితీయశ్రేణి నగరాల్లో విస్తరించేందుకు మాస్ మ్యూచువల్ వంటి సంస్థలు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. తద్వారా అక్కడి యువతకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TRS MEETING : కేంద్రంపై పోరులో భవిష్యత్తు కార్యాచరణపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం