Bandi Sanjay on job notifications: ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఇప్పటికే 20 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారని.. వారంతా ఏం చేయాలని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ మేరకు నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
డిగ్రీలు, పీజీలు చదివి ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్.. ఎన్నికలు వస్తేనే నోటిఫికేషన్లు అంటూ ఊదరగొడతారు. ఆయన లాకర్లలో కొన్ని విషయాలు పెట్టుకుంటారు. పాత సమస్యపై ఆందోళనలు చేస్తే కొత్త సమస్యను తెరపైకి తెస్తారు. రాష్ట్రపతి జారీ చేసిన జీవో 124 ను ఇంతవరకూ కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదు.? జీవో 317 తో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఆ జోవో సాకుతో
Bandi sanjay fired on cm kcr: ఓ వైపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు. సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం.. సమస్యలను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై స్పష్టత ఇచ్చేవరకు ఊరుకోబోమని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి హామీని విస్మరించారని.. కొత్తగా జీవో 317 ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ జోవో సాకుతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి జారీ చేసిన జీవో 124 ఉత్తర్వులను ఇంతవరకూ ఎందుకు అమలు చేయలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: Bandi Sanjay on Students Suicide : 'సర్కార్ తప్పు వల్లే ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు'