Telemedicine Services useful to patients: రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవేశపెట్టిన టెలీమెడిసిన్ సేవలు పేద రోగుల పాలిట వరంగా మారాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సేవలు విజయవంతంగా అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల్లో అందుబాటులోకి తెచ్చారు. కొన్నిచోట్ల ఈ సేవలు మొదలయ్యాయి. అయితే మరిన్ని ప్రాంతాలకు వీటిని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు.
అందుబాటులో పెద్దాస్పత్రుల వైద్యులు
పేద ప్రజలు ఏదైనా అనారోగ్యం బారిన పడితే... మారుమూల పల్లెల నుంచి నగరంలోని పెద్దాసుపత్రులకు రాకుండానే వారికోసం ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వారి ఇంటి ముంగిటకే వచ్చి ఈ సేవలు అందిస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆస్పత్రులను ఇప్పటికే అనుసంధానించారు. నిత్యం పలువురు టెలిమెడిసిన్ ద్వారా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. ఒక్క ఉస్మానియా ఆస్పత్రి నుంచే నిత్యం 100 పైనే స్లాట్లు కేటాయిస్తున్నారు. గాంధీ, నిమ్స్ నుంచి వైద్యులు ఈ సేవలను అందిస్తున్నారు.
ముదురుతున్న పెద్ద రోగాలు
జీవనశైలి మార్పులతో అనేక అసంక్రామిక వ్యాధులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్నాయి. వివిధ రకాల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. వీటిని ప్రాథమిక స్థాయిలో అడ్డుకట్ట వేయక పోవడంతో అనతికాలంలోనే ముదిరి పోతున్నాయి. తెలుసుకునేలోపు తీవ్ర నష్టం జరుగుతోంది. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలు, గుండె ఇతర అవయవాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇవేకాకుండా కీళ్లు, చర్మ వ్యాధులతో పాటు మానసిక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులు అందుబాటులో ఉండటం లేదు. ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లోనూ అంతంతే.
పేదలకు వరం
అంతా పేదలు, అల్పాదాయ వర్గాలు కావడంతో కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకునే పరిస్థితి ఉండటం లేదు. స్థానికంగా ఉన్న వైద్యునిపై ఆధారపడుతున్నారు. దీంతో వ్యాధులు ముదిరిపోయి ప్రాణాల మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెలీమెడిసిన్ సేవలు ప్రయోజనకరంగా ఉంటున్నాయి. వివిధ అనారోగ్య సమస్యలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదిస్తున్న వారిని అక్కడ వైద్యులు పరిశీలిస్తున్నారు. నిపుణుల సూచనలు అవసరమైతే ఉస్మానియా, గాంధీ లేదా నిమ్స్ వైద్యులను టెలీమెడిసిన్ ద్వారా సంప్రదిస్తున్నారు. ఇందుకు ముందు రోజే స్లాట్ బుక్ చేస్తున్నారు. అదే సమయానికి ఉస్మానియా లేదా గాంధీ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. ఇలా నేరుగా ట్యాబ్‌లో రోగిని చూస్తూ వారి సమస్యలను వింటున్నారు. అనంతరం పీహెచ్‌సీలో ఉన్న వైద్యునికి సూచనలు, సలహాలు, చికిత్సలు వివరిస్తున్నారు. అవసరమైతే పరీక్షలను సూచిస్తున్నారు. శస్త్ర చికిత్సలు లాంటివి చేయాలంటే అలాంటి వారిని మాత్రమే పెద్దాసుపత్రులకు రప్పించి చికిత్స చేసి పంపుతున్నారు. ఇలా ప్రాణాంతక రోగాలకు ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు.
ఇవీ చదవండి: ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. నాకేంటి క్యాన్సర్ అనుకున్నా..