తెలంగాణలో ఇందిర గాంధీని విపరీతంగా అభిమానించేవాళ్లు ఉన్నారనేది తెలిసిందే. గరీబీ హఠావో, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా ఇళ్లు వంటి పథకాలతో ప్రజల మనసుల్లో ఆమె సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మెదక్ నుంచి పోటీ చేస్తే జనం నీరాజనాలు పట్టారు. ఇప్పుడు ఇందిర పోలికలున్న ప్రియాంకతో ప్రచారం చేయించి ప్రజలను ఆకర్షించాలనేది కాంగ్రెస్ ఎత్తుగడ.
రాహుల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడుచోట్ల విజయం సాధించినప్పటికీ తెలంగాణలో ఘోరపరాజయం పాలైంది. బలమైన క్యాడర్, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్నా.... ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి. కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లో అధిక స్థానాలు గెలుచుకోవాల్సిందే. అందుకోసం ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.