TS Transco about Deficit : జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ఉత్పత్తి తగినంత లేనందున థర్మల్ విద్యుత్తుపైనే ఆధారడాల్సి వస్తోందని ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి తెలిపారు. గత అయిదేళ్లుగా విద్యుత్తు ఛార్జీలు పెంచలేదని చెప్పారు. బొగ్గు ధరలతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరగడం వల్ల ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించామన్నారు. ఛార్జీలు పెంపునకు విద్యుత్తు అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై విద్యుత్తు నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టింది. నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ శ్రీరంగారావు ఆధ్వర్యంలో రెడ్‌హిల్స్‌లోని ప్యాప్సీలో నిర్వహించిన బహిరంగ సభలో... శాఖాపరంగా తయారు చేసిన ప్రతిపాదనల వివరాలను రఘుమా రెడ్డి వివరించారు.
విద్యుత్తు వినియోగం పెరుగుతుంది
వచ్చే ఆర్థిక ఏడాది 13.76 శాతం విద్యుత్తు వినియోగం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు రఘుమా రెడ్డి వెల్లడించారు. గత ఆర్థిక ఏడాదిలో కేటగిరిలవారీగా విద్యుత్తు వినియోగం, ఉత్పత్తి, సరఫరా నష్టాలు, ఛార్జీల ద్వారా వచ్చిన మొత్తం తదితర వాటిని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ సర్‌ఛార్జీలు, ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీల వారీగా వినియోగం ఎంత ఉంది... స్థానికంగా ఉత్పత్తి ఎంత... బయట నుంచి కొనుగోలు చేస్తున్నది ఎంత తదితర వివరాలను నివేదించారు.
రెవెన్యూ లోటును పూడ్చుకోడానికే
85 శాతం వినియోగదారులు సబ్సిడీ కింద విద్యుత్తు పొందుతున్నవారే ఉన్నట్లు రఘుమా రెడ్డి పేర్కొన్నారు. రెండు డిస్కంలకు ఉన్న రెవెన్యూ లోటును పూడ్చుకోడానికే విద్యుత్తు ఛార్జీలను పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదికి రాష్ట్ర విద్యుత్తు అవసరాలకు రూ.34,870.18 కోట్లు నిధులు అవసరమని చెప్పారు. ఛార్జీలు, ఇతరాత్రా ద్వారా రూ.25,741.61 కోట్లు వస్తుండగా, ఇప్పుడు అమలవుతున్న టారిఫ్ ఆధారంగా రెవెన్యూ లోటు అంచనా రూ.9128.57 కోట్లు ఉన్నట్లు వివరించారు.
ఇందులో ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.1397.50 కోట్లుకాగా, విద్యుత్తు ఛార్జీల పెంపు ద్వారా రూ.5,044.32 కోట్లు వస్తుందని అంచనా వేశామన్నారు. అయినప్పటికీ మరో రూ.2,686.79 కోట్లు రెవెన్యూ లోటుగా ఉన్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు