‘స్వచ్ఛ భారత్’లో తెలంగాణ మరోసారి దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వరుసగా మూడోసారి ఈ అవార్డు దక్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్ దేశంలో మూడో స్థానం కైవసం చేసుకుంది. కేంద్ర తాగునీరు-పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్) సంచాలకుడు యుగల్ జోషి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు మంగళవారం రాసిన లేఖలో ఈ విషయం వెల్లడించారు.
చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు
ఏటా స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, జిల్లాలు, బ్లాక్‌లు, గ్రామ పంచాయతీల వారీగా అవార్డులు అందజేస్తోంది. తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో కేంద్రం గతేడాది మూడు కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా 2019 నవంబరు 1 నుంచి 2020 ఏప్రిల్ 20 వరకూ ‘స్వచ్ఛ సుందర్ సముదాయిక్ శౌచాలయ’ (ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్), జూన్ 15 నుంచి సెప్టెంబరు 15 వరకు జిల్లాలు, గ్రామాల కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణం- నిర్వహణకు సంబంధించి ‘సముదాయిక్ శౌచాలయ అభియాన్’ (ఎస్‌ఎస్‌ఏ), 2020 ఆగస్టు 8 నుంచి ఆగస్టు 15 వరకు చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు ‘గందగీ ముక్త్ భారత్’ (జీఎంబీ) కార్యక్రమాలను నిర్వహించారు.
కరీంనగర్ దేశంలోనే మూడో స్థానం
ఈ మూడు విభాగాల్లోనూ అద్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని యుగల్ జోషి రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే జిల్లాల విభాగంలో కరీంనగర్ దేశంలోనే మూడో స్థానం దక్కించుకుంది. ‘స్వచ్ఛ భారత్’ దివస్ సందర్భంగా అక్టోబరు 2న ఈ అవార్డులను అందజేయనున్నారు. కరోనా నేపథ్యంలో జూమ్, యూ ట్యూబ్ లైవ్ ద్వారా ఈ అవార్డులను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వర్చువల్ పద్ధతిలో అందచేస్తారు.
మంత్రి హర్షం వ్యక్తం
తెలంగాణకు వరుసగా మూడో ఏడాదీ స్వచ్ఛభారత్ అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదంతా సీఎం చేపట్టిన పట్టణ - పల్లె ప్రగతి, మిషన్ భగీరథ కార్యక్రమాల విజయ పరంపర ఫలితమన్నారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. అవార్డులు ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో గణనీయంగా పెరిగిన మటన్ వినియోగం