కేసీఆర్ ఒక్కరితోనే తెలంగాణ రాలేదని.. సమష్టి పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పడిందని తెంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా తెజస కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తెలంగాణ కోసం 12 వందల మంది యువత బలిదానాలు చేసుకున్నారని.. ఆనాటి ఉద్యమం తలచుకుంటే మనసు చలించిపోతుందని కోదండరాం గుర్తు చేసుకున్నారు. అయితే సమష్టి ప్రయోజనాలు, కొట్లాడిన వారి ప్రయోజనాలు పక్కన పెట్టి సంపన్నుల కోసం ప్రస్తుత నాయకులు పని చేస్తున్నారని కోదండరాం దుయ్యబట్టారు.
కనీసం కృష్ణా నీళ్లను కాపాడలేని బలహీన పరిస్థితిలో ప్రభుత్వం ఉందని.. ఇలాంటి సర్కార్ను ఎక్కడ చూడలేదని కోదండరాం విమర్శించారు. కరోనాను నియంత్రించే పరిస్థితిలో ప్రభుత్వం కనిపించడం లేదని విమర్శించారు.
"తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఈ క్షణం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంత ఘనంగా మనం పోరాటం చేశామో గుర్తుకు వస్తుంది. ప్రతిసారి మన అధికార పార్టీ నాయకులు కేవలం ముఖ్యమంత్రి ఒక్కరే తెలంగాణ తీసుకొచ్చారని అనడం ప్రమాదకర అంచనా. ఎంతోమంది పోరాడితేనే తెలంగాణ సిద్ధించింది."
-కోదండరాం, తెజస అధ్యక్షుడు
ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం'