TS Employees Transfers : కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ వేగవంతం కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో జిల్లా పోస్టులకు సంబంధించి ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... ఉద్యోగుల విభజన, కేటాయింపులపై సమీక్షించారు.
హైదరాబాద్ మినహా తొమ్మిది ఉమ్మడి జిల్లాల ఉద్యోగులను 32 కొత్త జిల్లాలకు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతి జిల్లా కేడర్‌లో 70కి పైగా ఉన్న శాఖల్లో 300 పైచిలుకు కేటగిరీల్లో ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రక్రియలో మూడు లక్షలకు పైగా ఉద్యోగులకు కొత్త కేడర్‌కు శాశ్వతంగా కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి కొత్త స్థానిక కేడర్‌కు ముందుగా వర్కింగ్ స్ట్రెంత్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఉద్యోగులను కేటాయించాల్సి ఉంది. కేటాయింపులు అన్ని జిల్లాలకు సరిగా జరిగేలా చూడాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రతి లోకల్ కేడర్‌లోని ప్రతి పోస్టుకు సీనియార్టీ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానిక కేడర్‌లకు ఉద్యోగులు విధిగా ప్రాధాన్యాలు ఇవ్వాలి. ప్రత్యేక కేటగిరీలకు సంబంధించిన వారు వాటి ధ్రువీకరణ పత్రాలు జతపర్చాలి. ఈ ప్రాధాన్యాలకు లోబడి ప్రత్యేక కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని సీనియార్టీ జాబితాను రూపొందిస్తారు. కేటాయింపు కమిటీలు సమావేశమై సీనియార్టీ జాబితా ప్రకారం ఉద్యోగులను కేటాయిస్తారు.
కేటాయింపుల జాబితాను కమిటీ ఆమోదించాక ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. కేటాయింపులు జరిగాక వారం రోజుల్లోపు ఉద్యోగులు కొత్త స్థానంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు షెడ్యూల్ కూడా ప్రకటించారు. దాని ప్రకారం రేపు ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకుంటారు. ప్రాధాన్యాలు, ప్రత్యేక కేటగిరీలను పరిగణలోకి తీసుకొని గురువారం సీనియార్టీ జాబితా రూపొందిస్తారు. ఈనెల 11వ తేదీ నుంచి 15 వరకు జిల్లా కేడర్ కేటాయింపు కమిటీలు సమావేశమై జాబితాలను ఆమోదిస్తాయి.
కేటాయింపులు పూర్తి చేస్తూ ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. 15వ తేదీ నుంచి వారం రోజుల్లోపు ఉద్యోగులు కొత్త స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో కేటాయింపులకు విడిగా షెడ్యూల్ ప్రకటిస్తారు. జోనల్, మల్టీ జోనల్ కేటగిరీలకు సంబంధించి కూడా ప్రత్యేక షెడ్యూల్ జారీ చేస్తారు. మొత్తం ప్రక్రియను నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. కేటాయింపుల ప్రక్రియ పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అధికారిని కేటాయించనున్నారు.
ఇదీ చూడండి: 'ఆర్డర్లు లేవు.. కొవిషీల్డ్ ఉత్పత్తిని 50% తగ్గిస్తాం'