చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వివరించారు. ఐలమ్మ వర్ధంతి పదో తేదీ నుంచి 17 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 10న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ వర్ధంతి సభను నిర్వహించనున్నట్లు వివరించారు. 11 నుంచి 15 వరకు అమరవీరుల స్థూపాల వద్ద కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 13న సిద్దిపేట జిల్లా బైరాన్పల్లి వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని అన్నారు.
జీఎస్టీ పరిహార చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఈ నెల 8న గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: దారుణం: ఆడపిల్లలు పుట్టారని పురుగులమందు తాగించిన తండ్రి