తెలంగాణ ఆర్టీసీ ప్రగతిబాట పడుతోంది. క్రమేపీ ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ ఆక్యుపెన్సీని రోజువారీ ఆదాయాన్ని మెరుగుపరచుకుంటోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్ అనంతరం తొలిసారి గత నెలలో గరిష్ఠంగా రోజు వారీ ఆదాయం రూ. 9.64 కోట్లు గడించింది. లాక్‌డౌన్ సడలించిన తరవాత ఒకటీ రెండు నెలల పాటు రోజువారీగా రూ.2 కోట్ల నుంచి రూ.రెండున్నర కోట్లకు మించి ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు.
సెప్టెంబరు నెల నుంచి కొద్దికొద్దిగా ఆదాయం పెరుగుతూ వస్తోంది. కరోనా ముందు వరకు రోజూ కాస్త అటుఇటుగా రూ.13 కోట్ల వరకు వచ్చేది. మార్చి నెలలో లాక్‌డౌన్ విధించటంతో సుమారు 70 రోజుల పాటు ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలించటంతో జూన్ 19వ తేదీ నుంచి హైదరాబాద్ మినహా జిల్లాల మధ్య కొద్ది కొద్దిగా బస్సులు రోడ్లపైకి వచ్చాయి. గరిష్ఠంగా రోజుకు మూడు కోట్ల రూపాయలు రావటం కష్టంగా మారింది. సుమారు 180 రోజుల తరవాత అంటే సెప్టెంబరు చివరి వారంలో హైదరాబాద్ నగరంలో పరిమితంగా సిటీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. గడిచిన నెలలో అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరటంతో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు మొదలయ్యాయి.
ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సర్వీసులూ పూర్తి స్థాయిలో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ ఆదాయం పుంజుకుంటోంది. గడిచిన నెల నుంచి ప్రజా రవాణాను వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
మరో మూడు నెలల్లో సాధారణ స్థితికి
రానున్న రోజుల్లో ఆక్యుపెన్సీ 64 నుంచి 66 శాతానికి పెరుగుతుందని ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు. గతంలో వలే రోజువారీగా రూ.13 కోట్ల ఆదాయం నమోదు కావాలంటే రెండు మూడు నెలల సమయం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుత ఆక్యుపెన్సీ
60 నుంచి 62 శాతం
రోజువారీగా బస్సులు తిరుగుతున్నది
30 నుంచి 34 లక్షల కి.మీ.
ఇదీ చూడండి: ప్రయాణికులు లేక డ్యూటీలు కోల్పోయిన ఉద్యోగులకు భరోసా