తెలంగాణలో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత అత్యల్ప ఉష్ణోగ్రత మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 3.4 డిగ్రీలు నమోదైంది. అంతకుముందు 1897, డిసెంబరు 17న నిజామాబాద్‌లో అత్యల్పంగా నమోదైన 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డుగా ఉండేది. 2017, డిసెంబరు 27న ఆదిలాబాద్‌లో 3.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదుకావడంతో ఆ రికార్డు చెదిరిపోయింది. తిరిగి మంగళవారం కోహీర్‌లో 3.4 డిగ్రీలు నమోదు కావడంతో ఆ రికార్డును తిరిగి రాసినట్లయింది.
ఈశాన్య, ఉత్తర భారత ప్రాంతాల నుంచి వస్తున్న శీతలగాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రంగా ఉంటోందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా 7 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్ర రాజధానిలో 10.4 డిగ్రీలు ఉంది. ఇది సాధారణంకన్నా 4.7 డిగ్రీలు తక్కువ. రాత్రిపూట, తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉంటున్నందున ఆ సమయంలో వృద్ధులు, చిన్నపిల్లలు బయట తిరగొద్దని వాతావరణ శాఖ సూచించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశాలున్నాయని ఆ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి: రైతులకు శుభవార్త.. 28నుంచి ఖాతాల్లో రైతుబంధు సాయం