Telangana Political Parties Election Campaign : రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఆశీర్వాద సభలతో గులాబీ దళపతి ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా, నియోజకవర్గాల్లో అభ్యర్థులు గడప, గడపకూ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ, మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరుతున్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో మంత్రి తలసాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రచారంలో భాగంగా మహిళలతో కలిసి నృత్యం చేశారు.
ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు
ఉప్పల్ అభ్యర్థి లక్ష్మారెడ్డికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పూర్తి మద్దతు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పద్మా దేవేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలో స్పీకర్ పోచారానికి మద్దతుగా పలువురు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. గతంలో చేసిన సహాయాన్ని గుర్తుంచుకున్న ఓ మహిళ కృతజ్ఞతలు తెలపగా పోచారం భావోద్వేగానికి గురయ్యారు.
Parties Focus on Election Campaign in Telangana : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో సుంకె రవిశంకర్‌కు మద్దతుగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఓట్లభ్యర్థించారు. భువనగిరి ఎమ్యల్యే శేఖర్ రెడ్డి మరోసారి గెలవాలని నాగిరెడ్డిపల్లి గ్రామస్థులు యాదగిరి గుట్టకు పాదయాత్ర నిర్వహించారు. ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో గొంగిడి సునీత కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిషోర్ మరోసారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రచారాలు
ఆరు గ్యారంటీలను ప్రచారాస్త్రాలుగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార బరిలో దూసుకుపోతోంది. అగ్రనేతల రాష్ట్ర పర్యటనలతో పార్టీ శ్రేణులతో జోష్ నింపుతున్నారు. హస్తం గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం వచ్చేలా కృషి చేయాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కీ... అరటిపండ్లు అమ్ముతూ, ఇస్త్రీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ముషీరాబాద్ పరిధిలో అంజన్‌కుమార్ యాదవ్‌కు మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఖైరతాబాద్ అభ్యర్థి విజయ రెడ్డి ఫిలింనగర్‌లో ఆరు గ్యారంటీల కార్డును వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలోని కార్యకర్తల సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత జరిగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి వెన్నెల పాదయాత్ర చేస్తూ హస్తం పార్టీకి ఓటేయాలని కోరారు.
Telangana Political Parties Focus on Election Campaign : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లో వినయ్‌రెడ్డి, బోధన్‌లో సుదర్శన్ రెడ్డి ఇంటింటి ప్రచారం జరిపారు. జహీరాబాద్‌లో చంద్రశేఖర్ ప్రచార రథంపై తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పెద్దపల్లి అభ్యర్థి విజయ రమణారావు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో పొన్నం ప్రభాకర్ డప్పు వాయిస్తూ, మహిళలతో కలిసి కోలాటాలాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌లో కొండా సురేఖ, పశ్చిమ నియోజకవర్గంలో నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల మండలంలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఓట్లు అభ్యర్థించారు. నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో జానారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
'ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా మార్చిన బీఆర్‌ఎస్‌ను ఓడించాలి'
బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ సైతం ప్రచార హోరు పెంచింది. రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు దిశగా ప్రధాని సహా, కేంద్రమంత్రులతో ప్రచారానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జూబ్లీహిల్స్ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డికి మద్దతుగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ అభ్యర్థి అరుణ తార ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డేకే అరుణ హాజరయ్యారు. మెదక్ జిల్లా అభ్యర్థి విజయ్ కుమార్ నిజాంపేట్ మండలంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.
వరంగల్‌లోని లేబర్ కాలనీ, కాశిబుగ్గ ప్రాంతంలో బీఎస్పీ అభ్యర్థి... ట్రాన్స్‌జెండర్ పుష్పిత లయ విస్తృత ప్రచారం నిర్వహించారు. భువనగిరి, మిర్యాలగూడ ఎమ్మెల్యేలుగా గెలిపించాలని సీపీఎం అభ్యర్థులు కొండమడుగు నరసింహా, జూలకంటి రంగారెడ్డి ప్రజలను కోరారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో 14 బీసీ సంఘాల సమావేశంలో ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.
పోలింగ్ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?