Ministers Counters On Rahul Gandhi: రాహుల్‌గాంధీపై తెరాస నేతలు విమర్శలు గుప్పించారు. రైతును రాజును చేయడం కాంగ్రెస్ వల్ల కాదని.. దమ్ముంటే భాజపాపై యుద్ధానికి సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. తెలంగాణకు రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారని... రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ మాత్రం ఎప్పటికీ తెలంగాణలోనే ఉంటారని స్పష్టం చేశారు.
బోగస్ సభ: కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ బోగస్ సభ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. పెట్టుబడి సాయం 15 వేల రూపాయలు అందిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని... ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయకుండా తెలంగాణలో అమలు చేస్తామని చెబితే ప్రజలు నమ్మబోరని ఎద్దేవా చేశారు.
ఎందుకు ఓడించారు: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని ప్రజలు నమ్మితే 2014, 2018లో ఆ పార్టీని ప్రజలు ఎందుకు ఓడించారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎనలేని త్యాగాలతో కేంద్రం మెడలు వంచి తెలంగాణ ప్రజలు రాష్ట్రం సాధించుకున్నారని తెలిపారు. 2018 ఎన్నికల్లో 2 లక్షల రూపాయల రుణమాఫీ హామీ ఇచ్చినా... ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మళ్లీ అదే పాత పాట పాడుతోందని విమర్శించారు.
అన్నీ నీటమూటలే: రాహుల్ గాంధీ విడుదల చేసిన డిక్లరేషన్‌లోని హామీలన్నీ నీటిమూటలేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాసిచ్చిన చిలుక పలుకులు తప్ప రాహుల్ మాటలో పసలేదన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఏఐసీసీదా లేక పీసీసీదా వెంటనే రాహుల్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై ఎలాంటి అవగాహన లేని రాహుల్ గాంధీ అనాలోచిత నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రైతులకు సరైన ధర నిర్ణయం కోసం నిర్దేశించిన స్వామినాథన్ కమిటీ సిఫార్సులను యూపీఏ సర్కారు పట్టించుకోలేదని తెరాస నేతలు విమర్శించారు.
ఇవీ చూడండి: