తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మార గంగారెడ్డిని మార్క్‌ఫెడ్ ఛైర్మన్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గ నిర్దేశకత్వంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు నామినేషన్లు పరిశీలించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పర్యవేక్షణలో ఛైర్మన్, ఏడు డైరెక్టర్ పదవులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం వల్ల పోటీ లేకుండాపోయింది. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లైంది. డెరెక్టర్లుగా నల్లవేలి అశోక్, ఎల్.శ్రీకాంత్ రెడ్డి, ఎస్.జగన్‌మోహన్ రెడ్డి, గంగా చరణ్ రేకుల, బొర్రా రాజశేఖర్, ఎన్.విజయ్ కుమార్, మర్రి రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.
తన వంతు కృషి చేస్తానని..
వ్యవసాయ రంగం, రైతాంగం వ్యవస్థకు సంబంధించి ఓ అన్నదాత బిడ్డకు కీలక బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ ఛైర్మన్ మార గంగారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థను బలోపేతం చేయడం ద్వారా రైతులకు సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన విజేతలకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 10న అధికారికంగా ఫలితాలు, 11న పాలకవర్గాన్ని టీఎస్ మార్క్‌ఫెడ్ సంస్థ ఎన్నికల అధికారి, సంయుక్త రిజిస్ట్రార్ బి.అరుణ ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయంగా సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పలు నాటకీయ పరిణామాలు
ఈరోజు ఉదయం టీఎస్ మార్క్‌ఫెడ్ డైరెక్టర్ పదవి కోసం నల్గొండ జిల్లా మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు కుంభం శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. అప్పుడు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే ఏకగ్రీవ ఎన్నికకు రంగం పూర్తిగా సిద్ధమైన తరుణంలో డైరెక్టర్ పోస్టుకు పోటీవద్దన్న ఉద్దేశంతో ఓ ప్రజాప్రతినిధి ఆయన నామినేషన్ పత్రాలు చింపేసి అడ్డుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇది అప్రజాస్వామిక చర్య, చీకటి దినమని, న్యాయపరంగా పోరాడతానని అని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
ఇదీ చూడండి : 'నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు... నన్నెవరని ప్రశ్నిస్తే నేనక్కడి నుంచి తీసుకురావాలె'