Telangana ENC Letter to KRMB Chairman: ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఇప్పటికే ఉమ్మడి జలాశయాల నుంచి వాటాకు మించి నీటిని ఉపయోగించుకుందని.... ఇక నుంచి నీటిని వాడుకోకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఏపీ 673 టీఎంసీల కృష్ణా జలాలను ఉపయోగించుకుందని... 971 టీఎంసీల్లో ఇది 74 శాతానికి పైగా ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ కేవలం 211 టీఎంసీలను మాత్రమే వాడుకొందని... 971 టీఎంసీల్లో ఇది కేవలం 25 మాత్రమేనని ఈఎన్సీ మురళీధర్ లేఖలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి 32 టీఎంసీలను అధికంగా ఉపయోగించుకొందని... తెలంగాణకు ఈ ఏడాది ఇంకా 108 టీఎంసీలు వాటాగా దక్కాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో ఇంకా కేవలం 76 టీఎంసీల నీరు మాత్రమే ఉందని... ఇదే సందర్భంలో ఏపీ తన వాటాకు మించి నీటిని తీసుకొందని తెలిపారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్... ఇక నుంచి నీటిని వినియోగించకుండా చూడాలని బోర్డును రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖలో కోరారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాల్వ, కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీని కోరింది. నీటి వినియోగం వివరాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేసింది.
ఫిబ్రవరి 17న హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వాదనలు వినిపించారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని బోర్డును కోరారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకొన్నది.. ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో తేలిపోతుందన్నారు. అదే విధంగా తమకు ఇంకా 141 టీఎంసీలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి వాడుకుందని... నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని ఈ సమావేశంలోను వాదనలు వినిపించారు. అప్పుడు ఏపీ ఈఎన్సీ హాజరు కాకపోవడంతో ఈ నెలలో మరోమారు కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: