హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు తెరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెట్రో రైలు, షాపింగ్ మాల్స్ తెరిచినప్పుడు... పార్కులు తెరిచేందుకు ఇబ్బంది ఏమిటని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చినప్పటికీ.. పార్కులను ఎందుకు తెరవడం లేదని అడిగింది.
కేబీఆర్ పార్కు తెరిచేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ జయంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం ప్రకటించిన అన్‌లాక్-4లో పార్కుల నిర్వహణపై ఎలాంటి నిషేధం లేకపోయినప్పటికీ.. పార్కు తెరవడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాలకృష్ణ వాదించారు.
పార్కును తెరవాలని కోరుతూ వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందించడం లేదని పేర్కొన్నారు. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన కేబీఆర్ పార్కులో అనేక ఔషధ మొక్కలు.. నడక కోసం సుమారు 4 కిలోమీటర్ల ట్రాక్ ఉందని.. స్వచ్ఛమైన గాలి లభిస్తుందని వివరించారు. పార్కు తెరిచేందుకు అభ్యంతరం లేదని.. దానిపై స్పష్టత కోసం కేంద్రానికి లేఖ రాశామని.. సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రమదారెడ్డి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్