రాష్ట్రంలో నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగాయని హైకోర్టు పేర్కొంది. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరకులు ధరలు నియంత్రణ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం లేదని వ్యాఖ్యానించింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు... మరోసారి విచారణ చేపట్టింది. ధరల నియంత్రణ చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం, పోలీసులు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించింది.
నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం ఆదేశాలు జారీ చేయలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. విపత్కర పరిస్తితుల్లో ప్రజలు దోపిడీకి గురయ్యేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
జంటనగరాల్లో కేవలం 290 కేసులు నమోదు చేశారని పేర్కొంది. నిత్యావసర ధరలు పెరుగుతూ పోతే.. లాక్డౌన్లో సామాన్యులు ఎలా జీవించాలని ప్రశ్నించింది. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరల నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో ఈనెల 26లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇవీ చూడండి:అక్టోబర్‌లోగా ప్యాకేజీ-9 ద్వారా సిరిసిల్ల జిల్లాకు సాగునీరు