HC CJ Urges People: రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వంతో పాటు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని… తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ (Telangana high court Chief Justice Satish Chandra Sharma urges people) కోరారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని గృహకల్పలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్ అథారిటీ నూతన కార్యాలయాన్ని అథారిటీ ఛైర్మన్ జస్టిస్ ప్రకాశ్‌రావుతో కలిసి ప్రారంభించారు. మూసీ నదిని చూసిన తొలిసారి అది మురుగు కాలువ (pollution in musi river) అనుకున్నానని జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ వ్యాఖ్యానించారు.
''హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ అందమైన హుస్సేన్‌సాగర్ ఉందని విన్నాను. మొదట హుస్సేన్సాగర్నే చూడాలనుకుంటున్నా అని డ్రైవర్‌కి చెప్పాను. డ్రైవర్, వ్యక్తిగత కార్యదర్శితో అక్కడకి వెళ్లాను. డ్రైవర్ కారు ఆపి.. ఇదే హుస్సేన్‌సాగర్ అని చెప్పినప్పుడు చాలా సంతోషంగా కిందకి దిగాను. కానీ అక్కడ కనీసం ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోయాను. మురుగుకాలువలా ఉన్న హుస్సేన్‌సాగర్‌ను చూసి చాలా బాధగా అనిపించింది. మానవాళి పర్యావరణానికి ఏ విధంగా హాని చేస్తున్నామో ఇక్కడే అర్థమవుతోంది. హైకోర్టు వద్దకు వచ్చినప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నది నాలా అనుకున్నాను. కానీ అది మూసీ నది అని చెప్పారు. నేను నిర్ఘాంతపోయా. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు మూసీనది గురించి గొప్పగా విన్నాను.''
-తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ
ఇటీవల విమానాశ్రయానికి వెళుతుంటే కొంతమంది వ్యక్తులు సంచుల్లో చెత్తను తెచ్చి రోడ్డుపై వేశారని.. దానిని చూసిన తన కుమారుడు కారు ఆపి రోడ్డుపై ఉన్న ఆ చెత్తను చెత్తకుండీలో వేశారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలపై వేయకుండా అందరూ బాధ్యతగా ఉండాలని జస్టిస్ సతీష్ చంద్రశర్మ (HC CJ Satish Chandra Sharma urges people) సూచించారు. ఇండోర్ నగరానికి అయిదుసార్లు క్లీన్‌సిటీ అవార్డు వచ్చిందని.. అక్కడి కలెక్టర్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు మరుగుదొడ్ల పక్కనే.. ఫుట్‌పాత్‌ఫై భోజనం చేశారని జస్టిస్ గుర్తు చేసుకున్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు, ప్రభుత్వం సైతం కృషి చేయాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువుల్ని సున్నా స్థాయికి తీసుకురావల్సిన అవసరం ఉందని.. పీసీబీ అప్పిలేట్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ బి.ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. సమావేశంలో పీసీబీ సభ్యకార్యదర్శి నీతూకుమారి ప్రసాద్, అప్పిలేట్ అథారిటీ సభ్యులు వి.జయతీర్థరావు, వి.ప్రభాకర్‌రెడ్డి, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, పీసీబీ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ సీవై నగేశ్ పాల్గొన్నారు. బేగంపేటలోని పీసీబీ కార్యాలయంలో ఉన్న అప్పిలేట్ అథారిటీని నాంపల్లికి మార్చారు.
‘భాగ్యనగరానికి మరో మణిహారంగా హుస్సేన్‌సాగర్‌ను తీర్చిదిద్దుతాం.. సరస్సును పూర్తిగా మంచినీటితో నింపడమే కాకుండా ఇదో ఆహ్లాదకర ప్రాంతంగా మారుస్తాం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి ఇదో పర్యాటక ప్రాంతంగా కనిపించేలా చేస్తాం.. సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలను నిర్మిస్తాం..’ అయిదేళ్ల కిందట ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇది. ఎన్ని కోట్లు పెట్టి సాగర్‌ను ప్రక్షాళన చేయాలనుకున్నా.. అది ఇప్పటికీ జరగట్లేదు.
ఇవీ చూడండి: