Tifa Scanning in Govt. Hospitals in Telangana : మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు, పోషకాహార లోపం ఇలాంటి కారణాలతో గర్భస్థ శిశువులో లోపాలు తలెత్తుతున్నాయి. వైద్య పరీక్షల సమయంలో సాధారణ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తున్నప్పటికీ.. వీటిని గుర్తించడం సాధ్యం కావడం లేదు. ఐతే టిఫా స్కానింగ్ వల్ల ఎలాంటి గర్భస్థ శిశువులోని లోపాలను ముందే గుర్తించే వీలుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆర్థిక స్థోమత కలిగిన వారు ఈ స్కానింగ్‌ను చేసుకుంటున్నారు.
యంత్రాలను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు: కానీ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే నిరుపేద గర్భిణులు ఇందుకు దూరమవుతున్నారు. ఈ ఇబ్బందులు తీర్చి ఆరోగ్యవంతమైన శిశువులు జన్మించేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ టిఫా స్కానింగ్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఒకేసారి 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ యంత్రాలను హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
శిశువు లోపాలను ముందే తెలుసుకోవచ్చు: పుట్టిన 100 మంది శిశువుల్లో ఏడుగురికి లోపాలుంటున్నాయని వాటిని టిఫా స్కానింగ్ ద్వారా గుర్తించడం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పేట్ల బురుజు ఆసుపత్రిలోనే కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. శిశువు గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు, కంటి రెప్పలు, పెదవులు, వేళ్లు, చెవులు, కళ్లు, ముక్కు.. ఇలా ప్రతి అవయవాన్ని 3డీ, 4డీ ఇమేజింగ్ రూపంలో టిఫా యంత్రం స్కాన్ చేస్తుంది.
ఉచితంగా స్కానింగ్: గ్రహణమొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలను టిఫా స్కానింగ్‌లో పసిగట్టవచ్చు. ఈ లోపాల వల్ల కొందరు పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చు. అలాంటి వాటిని ముందే గుర్తించగలిగితే ప్రసవ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు టిఫా స్కానింగ్ వల్ల వైద్యం అందించే అవకాశం ఉంది. నిరుపేద గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలాంటి రుసుము లేకుండా టిఫా స్కానింగ్ చేయనున్నారు.
ఇవీ చదవండి: