Auction of 104 vehicles: గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలందించిన ‘104’ వ్యవస్థ కనుమరుగవుతోంది. ‘104’ సంచార వాహనాల్లో ప్రతి ఊరికి వెళ్లి.. రక్తపోటు, మధుమేహం తదితర జీవనశైలి వ్యాధి బాధితులకు ప్రతి నెలా పరీక్షలు నిర్వహించడంతోపాటు ఔషధాల్ని ఉచితంగా అందించిన ఈ వ్యవస్థ ఇక గత చరిత్ర కానుంది. ఈ వాహనాలను వేలం వేయాలని సర్కారు నిర్ణయించింది. ఈమేరకు ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 198 వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
ఇందుకోసం కలెక్టర్ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా సేవలు ఇప్పటికే దాదాపు నిలిచిపోగా.. వినియోగం లేకపోవడంతో పలు వాహనాలు పాడైపోయాయి. ఈ వ్యవస్థలోని 1,250 మంది వైద్య సిబ్బందిని ఇతర సేవలకు వినియోగించే దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జీవనశైలి వ్యాధుల నివారణ పథకం అమల్లోకి రావడంతో దాదాపు ఆరు నెలల నుంచి 104 వైద్యసేవలు క్రమేపీ కనుమరుగవుతూ వచ్చాయి. జీవనశైలి వ్యాధుల నివారణ పథకంలో భాగంగా ఇంటింటికీ ఔషధాల్ని సరఫరా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికితోడు త్వరలోనే పల్లె దవాఖానాల్ని ప్రారంభించనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: సామాన్యులకు కేంద్రం షాక్.. గ్యాస్ సబ్సిడీకి మంగళం3